పాక్‌కు నీటి విడుదల ఆపేస్తాం – నితిన్ గడ్కరీ

పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఇప్పటికే పాక్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాన్ని 200 శాతానికి పెంచింది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను భారత్ రద్దు చేసింది. తాజాగా, పాకిస్తాన్ కు నీటి సరఫరా కట్టడి చేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మూడు నదుల ద్వారా పాకిస్థాన్‌లోకి ప్రవేశిస్తున్న నీటిని యమునా నదిలోకి మళ్ళిస్తామని చెప్పారు.

తూర్పు నదుల నుంచి పాక్‌కు వెళుతున్న జలాలను జమ్మూ కశ్మీర్‌, పంజాబ్‌లకు మళ్లించాలని ప్రధాని నరేంద్ర మోది నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గడ్కరీ ట్వీట్‌ చేశారు. రావి నదిపై షాపూర్‌-కంది వద్ద జలాశయం పనులు ప్రారంభయ్యాయని, యూజేహెచ్‌ ప్రాజెక్టులో నిల్వ చేసే మన జలాలను జమ్మూ కశ్మీర్‌ కోసం వాడతామని, మిగిలిన జలాలను రెండో రావి-బియాస్ లింక్ ద్వారా నీటిని యమునా నదిలోకి మళ్లించి ఇతర పరీవాహక రాష్ట్రాలకు సరఫరా చేస్తామని గడ్కరీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ ఇప్పటికే జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించామని వరుస ట్వీట్లలో గడ్కరీ వెల్లడించారు.

సింధూ జలాల ఒప్పందం-1960 ప్రకారం బియాస్, రావి, సట్లేజ్ నదీ జలాలను వాడుకునేందుకు భారత్‌కు హక్కుంది. సింధూ, జీలం, చినాబ్ నదీ జలాలను పాకిస్తాన్ వాడుకోవచ్చు. అయితే భారత నదీ జలాలను భారత్ సక్రమంగా వినియోగించుకోవడం లేదు. ఆ నీటిని పాకిస్తాన్ ఉపయోగించుకుంటోంది. కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో మన నీటిని పాకిస్తాన్‌కు వెళ్లకుండా నిలిపివేయాలని మోది సర్కార్ నిర్ణయించినది. 2016‌లో యూరి దాడి జరిగినప్పుడే పాకిస్తాన్‌కు నీటిని ఇవ్వకూడదని, ఇందుకోసం త్వరిత గతిన ప్రాజెక్ట్‌లు నిర్మించ దలచినది.