‘చంద్రబాబు మోదీ జపం’

న్యూఢిల్లీ, జనవరి 4: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానాలని బీజెపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు హితవు పలికారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు మోదీ ఫోబియా పట్టుకుందని విమర్శించారు. రోజు మోదీ జపం చేస్తున్నారని, ఆయన మోదీ పేరు రాస్తుంటే ఈ పాటికి మోదీ కోటి పూర్తి అయ్యేదన్నారు. దేనిలో గొప్ప అని చంద్రబాబును చూసి మోదీ అసూయపడాలని ప్రశ్నించారు.  ఇతర రాష్ట్రాలకు మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుండి నిధులు విడుదల చేస్తున్నారని చెప్పారు.  రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటూ అసత్య ప్రచారం, చౌకబారు రాజకీయాలు మానుకోవాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు, సహకారం లేకుండా రాష్ట్రంలో చంద్రబాబు ఇప్పటి వరకూ ఏమి చేసారో చెప్పుతారా అని ప్రశ్నించారు. హైకోర్టుకు రెండు అంతస్తుల భవనాన్ని కూడా అనుకున్న వ్యవధిలో కట్టలేకపోయారన్నారు. చంద్రబాబు, తేదేపా నేతలు చేస్తున్న అబద్దాలను ఎండగడతామన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్‌ను తెదేపా నట్టేట ముంచిందని అన్నారు. “చంద్రబాబు తానేదో గొప్పగా ఊహించుకుంటున్నారు, మెలో డ్రామా ప్లే చేయాలని చూస్తున్నారు” అని జీవిఎల్ అన్నారు.  .