బాబు గారు మీకేమైనా అయితే?? : కోపంలో చరిత్ర తిరగరాసిన చంద్రబాబు

 

చంద్రబాబు నాయుడు.. వయసు 70 … 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ… 9 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు, 5 ఏళ్ళు విభాజిత ఆంధ్రకు సీఎం. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఆరోగ్యం విషయంలో కచ్చితంగా ఉంటారు.. ఆహరం విషయంలో నియమాలు పాటిస్తారు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అంటే… పాపం అయన శాసన సభలో వ్యవహరిస్తున్న తీరుతో లేనిపోని కొత్త ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నట్లే కనిపిస్తోంది.

శాసన సభ సమావేశాల్లో మొదటిరోజే సభ వేడెక్కింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఐతే శివతాండవం చేసారు. నివర్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతాంగం విషయంలో చర్చ సందర్భంగా చంద్రబాబు తనకు ముఖ్యమంత్రి అడ్డుపడుతున్నారని ఏకంగా ఇప్పుడు లేనంత కోపంతో ఊగిపోయారు. ఆయన బీపీ 180 పైనే దాటి ఎక్కడికో వెళ్లిపోయినట్లు అనిపించింది. సీఎం వైపు కోపంగా చూస్తూ ఆలాగే మరో మైలురాయి అధిగమించారు. ఏకంగా స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు. ఇది చంద్రబాబు రాజకీయ జీవితంలో మొదటి చర్య. ఎప్పుడు కనీసం తన సీట్ కూడా దాటకుండా వ్యవహరించే చంద్రబాబు కోపాన్ని, ఉక్రోషాన్ని, ఆవేశాన్ని ఆ పార్టీ నేతలే అలా చూస్తూ ఉండిపోయారు. ఈయనకు ఏమైందో అని.. చాలా మంది ఆయన వెనుకే ఉండిపోయారు. బాబు స్పీకర్ పోడియం వరకు దూసుకురావడమే పెద్ద విషయం అయితే అక్కడే కూర్చువడంతో ఎం జరుగుతుందో తెలుసుకోలేక కనీసం ఆయన పార్టీ ఎమ్మెల్యే లు సైతం ఆయనను అనుసరించే సాహసం చేయలేకపోయారు. సర్రున పెద్ద అరుపులతో బాబు తీసుకున్న నిరశన మేము ఉహించలేకపోయామని నాయకులూ చెబుతున్నారు.

ఎందుకీ అసహనం…

** ముఖ్యమంత్రి హోదాలో జగన్ కావాలనే కొన్ని విషయాల్లో చంద్రబాబు ఓపికను పరీక్షిస్తున్నట్లు కనిపిస్తుంది. అధికార పక్షం నుంచి 151 మంది సభ్యుల మాటలు, సభలో రన్నింగ్ కామెంట్రీ బాబుకు ఎక్కడ లేని కోపం తెప్పిస్తోంది. ఒకప్పుడు తన వద్ద పనిచేసిన వారు, తానూ రాజకీయాల్లోకి వచ్చే సమయంలో చిన్న పిల్లలుగా ఉన్నవారితో మాటలు పడటం, వారితో నీతులు చెప్పించుకోవడం వంటివి బాబు ఉక్రోషానికి కారణంగా కనిపిస్తున్నాయి. ప్రతి మాటకు బాబు చాలా కోపంగా రియాక్ట్ అవుతున్నట్లు ఓ నేత చెప్పారు.
** చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో మధ్యలోనే మైక్ కట్ కావడం సైతం ఆయనలోని అసహనాన్ని పెంచుతోంది. బాబు మాటల మధ్యలోనే మంత్రులు, ముఖ్యమంత్రి కల్పించుకోవడం మాజీ సీఎం గా 14 ఏళ్ళు పని చేసిన చంద్రబాబుకి ఏ మాత్రం రుచించడం లేదన్నది ఆయన కోపంలో తెలుస్తుంది.
** తెలుగుదేశం పార్టీ తీరు నానాటికి దిగజారిపోతున్న సమయంలో ఎలాగైనా ప్రభుత్వ తీరు మీద ప్రజా వ్యతిరేకత తీసుకురావాలన్న కసి, మీడియా ను శాసన సభ ప్రత్యక్ష ప్రసారాలు చేయనీయకుండా జగన్ అడ్డుకున్న తీరు మీద బాబు తీవ్రమైన కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా ప్రసారాలు లేకుంటే తమ వాయిస్ ఎలా వెళ్తుందని ఇది కావాలని చేసిన కుట్రగా ఆయన వాపోతున్నారు.
** జగన్ పదేపదే ఆయనను చూస్తూ చేస్తున్న వ్యాఖ్యానాలు, దానికి కొనసాగింపుగా మంత్రుల కామెంట్రీలు మరింత వేడి పెంచుతున్నాయి. అలాగే చర్చ సమయంలో జగన్ హావభావాలు , వెక్కిరించే ధోరణిలో చేస్తున్న సైగలు సైతం చందర్బాబు ను కుదురుగా కుర్చోనివ్వడం లేదు.
దానికి ప్రతిగా మంత్రులు సైతం చర్చ సందర్భలో బాబు కోపాన్ని పెంచేలా చేస్తున్న వ్యాఖ్యానాలు బాబు భరించలేకపోతున్నారు.

ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న సభ వ్యూహంలో చంద్రబాబు పడుతున్నట్లే కనిపిస్తోంది. ఆయనకు వచ్చే కోపం , అసహనం ఆయనకే ప్రతికూలంగా మార్చే వ్యూహం వైస్సార్సీపీ అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అంటే కోపంలో చంద్రబాబు ఏ మాత్రం గతి తప్పినా దాన్ని తమకు అనుకూలంగా మల్చుకునేలా అధికార పక్షం వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. దీన్ని ఛేదించాల్సింది పోయి చంద్రబాబు దానిలో చిక్కుకున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
                 వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఎలా ఉన్నాఅసలే 70 లోకి వచ్చిన మా పెద్దాయనకు కావాలనే కోపం తెప్పించి.. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్య సమస్యలు తెప్పించేలా ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది అంటున్న తెలుగు తమ్ముళ్ల పాయింట్ కూడా సరి అయిందే… అయితే దీనికి ముందుగా ప్రభుత్వం మీద, సీఎం మీద కోపం, బీపీ పెంచుకోకుండా చంద్రబాబు సానుకూలంగా, ప్రశాంతంగా స్పందిస్తే ఆయన ఆరోగ్యానికి…. తెలుగుదేశం పార్టీకి మంచిదని గుర్తించాలి…