చైనా రికార్డు అధిగమించాం : బాబు

అమరావతి, డిసెంబర్ 24: కాంక్రీట్ పనుల్లో చైనా రికార్డు అధిగమించామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు చాలా అద్భుతమైన రోజు, పోలవరానికి తొలిగేటు బిగింపు శుభ సందర్బం అని ఆయన పేర్కొన్నారు. నీరు-ప్రగతి పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 22 గంటల్లో 16,368 క్యూ.మీ కాంక్రీట్ పనులు చేసి చైనా రికార్డు అధిగమించాం. కాంక్రీట్ పనుల్లో ప్రపంచ రికార్డు కూడా అధిగమిస్తాం అన్నారు.

చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లోని కొన్ని ముఖ్యాంశాలు :

  • పోలవరానికి సిబిఐపి అవార్డు మనందరికీ గర్వకారణం. పోలవరానికి అటు అవార్డులు, ఇటు రికార్డులు. ఇది సమష్టి ఘనత. ఇది సమష్టి బాధ్యత. ఈ ఘనత అందరికీ చెందుతుంది.
  • ప్రజల సహకారం, అధికార యంత్రాంగం తోడ్పాటుతోనే ఈ విజయం. దీనికి కేంద్రం సహకారం కూడా తోడైతే మరింత అభివృద్ధి సాధించేవాళ్లం.
  • ఏ రంగం అభివృద్ధి సాధించాలన్నా జలవనరులే కీలకం. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తోడ్పాటు లేదు. అయినా పట్టుదలతో ముందుకు వెళ్తున్నాం.
  • కేంద్రం అడుగడుగునా ఇబ్బందులు పెడుతోంది. దేనినైనా ఎదుర్కోగల సత్తా మనకుంది. ప్రజాసహకారంతో వీటన్నింటినీ అధిగమిస్తున్నాం.
  • వ్యవసాయ వృద్దిలో దేశం కన్నా 5 రెట్లు ఎక్కువ సాధించాం.
  • పొరుగు రాష్ట్రం కన్నా 30 రెట్లు ముందున్నాం. నాలుగేళ్లలోనే రైతుల ఆదాయం రెట్టింపు చేశాం. చేపట్టిన వినూత్న పథకాలన్నీ సత్ఫలితాలు ఇస్తున్నాయి.
  • నదుల అనుసంధానం చేశాం. భూగర్భ జలాలు పెంచాం. పశు సంవర్ధకం, ఆక్వాల్లో రాబడి పెంచాం.
  • మన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ప్రపంచానికే నమూనా. సంపద సృష్టించడంలో అధికార యంత్రాంగమే కీలకం.