టాక్సిసిటీ వల్లనే ఆవుల మృతి:తేల్చిన సిట్

విజయవాడ: రాష్ట్రంలో తీవ్ర సంచలనం కల్గించిన ఆవుల మృతి ఘటనలో సిట్ అధికారులు దర్యాప్తు పూర్తి చేశారు. నగర శివారు కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలో ఆగస్టు పదవ తేదీ అర్థరాత్రి ఒక్కటొక్కటిగా 86 ఆవులు మృతి చెందిన సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో ఆవులు మృతి చెందడంతో కుట్ర కోణం ఉందంటూ గో ప్రేమికులు ఆరోపించారు. హైదరాబాద్ గోషామహాల్ బిజెపి ఎమ్మెల్యే టి రాజాసింగ్ సైతం ఘటనా స్థలాన్ని సందర్శించి పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన దర్యాప్తునకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పటు చేసింది.

సిసిఎస్ ఏసిపి శ్రీనివాసరావు నేతృత్వంలోని సిట్ బృందం గోవుల మృతికి సంబంధించి అన్ని అంశాలను పరిశీలించింది. ప్రకాశం జిల్లా నుండి వచ్చిన గడ్డిలో రసాయనాల శాతం అధికారంగా ఉన్నట్లు పశుసంవర్థక శాఖ అధికారులు గుర్తించారు. టాక్సిసిటి అధికంగా ఉన్న పశుగ్రాసం తినడం వల్లే నైట్రేట్లుగా మారి పశువుల ప్రాణం తీసినట్లు పశుసంవర్థక శాఖ అధికారులు పోస్టుమార్టం నివేదికలో వెల్లడించారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఏమీలేదనీ, గ్రాసంలో చేరిన అధిక శాతం నైట్రేట్ల కారణంగానే ఆవుల మరణాలు సంభవించాయని బృందం తేల్చింది. ఈ మేరకు విజయవాడ సిపి ద్వారకా తిరుమలరావుకు సిట్ బృందం నివేదిక అందజేసింది.