ఎక్స్ఎల్‌ఆర్‌ఐ’కు సిఎం శంఖుస్థాపన

అమరావతి, జనవరి 17: అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. ఎక్స్ఎల్‌ఆర్‌ఐ బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థకు ప్రభుత్వం తుళ్లూరు మండలం ఐనవోలులో 50 ఎకరాలను కేటాయించింది. ఈ విద్యాసంస్థకు చంద్రబాబు భూమి పూజ నిర్వహించారు.

అమరావతి నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పారు. పూర్తిగా పేదరికం పోవాలంటే విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ఈ విద్యాసంస్థ రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తుందని చెప్పారు. పిజి, యుజి మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ఐదు వేల మంది చేరే అవకాశం ఉంటుందని అన్నారు. శాశ్వత భవన నిర్మాణం అందుబాటులోకి వచ్చే వరకూ తాత్కాలిక భవనంలో తరగతులు నిర్వహిస్తారని చంద్రబాబు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలు విద్యాసంస్థల ప్రముఖులు, విజయవాడ, గుంటూరు బిషప్‌లు హజరయ్యారు.