వైసిపి నేతల తగాదాలపై ఫోకస్ పెట్టిన సీఎం!మార్పు మంచిదే అంటున్న పార్టీ వర్గాలు!!

పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారడంతో వైసిపి అధినేత, ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్రెడ్డి స్పీడ్ అయ్యారు.మొన్న విశాఖపట్నంలో పార్టీ అగ్రనేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ ,అమర్నాథ్ రెడ్డి ల మధ్య జరిగిన వాదోపవాదాలను తీవ్రంగా పరిగణించిన జగన్ ఆ ముగ్గురు తో సమావేశమై పంచాయితీ చేశారు.

ఎవరికి ఇవ్వాల్సిన డోసు వారికిచ్చారు.ఇదింకా మరుగునపడకముందే తూర్పుగోదావరి జిల్లాలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మధ్య ఇంతకంటే పెద్ద వివాదం చోటుచేసుకుంది. సుభాశ్చంద్ర బోసు పై ఎమ్మెల్యే ద్వారంపూడి ఒంటికాలిపై లేవడమే కాకుండా హెచ్చరికలు సైతం చెయ్యడం జరిగింది.దీంతో సీఎం జగన్ కు చిర్రెత్తుకొచ్చింది.వెంటనే వారిద్దరినీ కూడా పిలిపించుకుని క్లాస్ పీకారు.ఎవరి పని వారు చేసుకోవాలని బహిరంగంగా గొడవలకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జగన్ హెచ్చరించినట్టు సమాచారం.

అంతేగాకుండా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు న్యూసెన్సుగా తయారైన నేపథ్యంలో అతన్ని వదిలించుకునే ప్రక్రియను కూడా జగన్ స్పీడప్ చేశారట.టెక్నికల్ గా ఇప్పటికీ వైసిపిలోనే రఘురామకృష్ణంరాజు ఉన్నప్పటికీ అతడికి పార్టీకి సంబంధం లేదు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి పార్టీ క్యాడర్లోకి పంపడానికి జగన్ చర్యలు తీసుకున్నారు.ఆగమేఘాల మీద నర్సాపురం లోక్సభ నియోజకవర్గ పార్టీ ఇంఛార్జిగా మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు గోకరాజు రంగరాజు ను జగన్ నియమించేశారు.ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశముందని అన్నింటికీ సిద్ధంగా ఉండాలని రంగరాజుకు ముఖ్యమంత్రి సూచనలు చేశారని సమాచారం.

ర‌ఘురామ కృష్ణంరాజు క్షత్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కావ‌డంతో ఇప్పుడు అదే వ‌ర్గానికి చెందిన, ఆర్థికంగా బ‌లంగా ఉన్న రంగ‌రాజునే ర‌ఘురామ‌పై ప్రయోగించాల‌ని జ‌గ‌న్ స్కెచ్ గీశారు.ఇప్పుడిప్పుడే జగన్ పార్టీ వ్యవహారాలను కూడా పట్టించుకుంటున్నారని,ఎప్పటికప్పుడు తన నమ్మకస్తుల చేత నివేదికలు తెప్పించుకుంటున్నారని భవిష్యత్తులో మరికొన్ని సంచలన సంఘటనలు పార్టీలో జరిగే అవకాశాలు ఉన్నాయని వైసిపి ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి.ఇవాళ కాకున్నా రేపైనా స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం ఖాయం కాబట్టి ఆలోపు పార్టీలో ఎటువంటి లుకలుకలు లేకుండా చేసుకోవాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.