Amaravathi : పై ఏపీ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చి మరో మూడు నెలల్లో రెండేళ్లు పూర్తి కావొస్తోంది. ఈ కాలంలో ప్రభుత్వం అమరావతిపై Amaravathi దృష్టి పెట్టలేదు. సీఎం జగన్ కూడా అమరావతి ప్రాంతంలో పర్యటించింది లేదు. 2019 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశంలో మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ ఆ ప్రాంతంలో భూములిచ్చిన రైతులు నిరవధికంగా ధర్నా చేస్తున్నారు. టీడీపీతో సహా అనేక పార్టీలు కూడా నిరసన తెలియజేస్తున్నాయి. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం వీరి ఆందోళనల గురించి పట్టించుకోలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం అకస్మాత్తుగా అమరావతిపై దృష్టి సారించింది. కమిటీ వేసి నిర్మాణంలో ఉన్న భవనాల పరిస్థితిపై అధ్యయనం చేస్తోంది.

కమిటీ నిర్ణయించింది ఇదే..
ఏపీ రాజధానిని విశాఖకు తరలించాలనేది సీఎం జగన్ లక్ష్యం. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి కూడా. కానీ.. ఏ క్షణాన విశాఖను రాజధానిగా ప్రకటించారో కానీ.. ఎల్ జీ పాలిమర్స్ ఘటన నుంచి వరుసగా విశాఖ షాక్ ఇస్తూనే ఉంది. రీసెంట్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాష్ట్రాన్ని.. ముఖ్యంగా వైజాగ్ ను కుదిపేస్తోంది. ఓవైపు విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తూ ఆందోళనలు, ధర్నాలు నిరంతరంగా జరుగుతున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా 93 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అయినా.. జగన్ ప్రభుత్వం విశాఖకు రాజధాని తరలించేందుకే మొగ్గు చూపుతోంది. సీఎంగా జగన్ అధికార పగ్గాలు చేపట్టాక సచివాలయం తప్పించి అమరావతి మొహం కూడా జగన్ ఇప్పుడు అమరావతిపై కదిలారు. సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఆధ్వర్యంలో 9మంది సీనియర్ అధికారులతో కమిటీ వేశారు. 75 శాతం నిర్మాణాలు పూర్తైన భవనాలను పూర్తి చేయాలని ఈ కమిటీ నిర్ణయం కూడా తీసుకుంది. కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని త్వరలోనే సీఎం ముందు ఉంచనున్నారు. ఇందుకు అయ్యే వ్యయం 2112 కోట్లుగా నిర్ధారించి ఈ లెక్కలను కూడా సీఎం ముందు పెట్టేందుకు సిద్దమవుతున్నారు. అయితే..
ప్రభుత్వానికి ఇప్పుడే ఎందుకు..
ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతిపై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అనే అనుమానం కూడా అందరిలో ఉంది. రియల్ ఎస్టేట్ జరిగింది, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది, స్మశానంలా ఉంది.. అని గతంలో మంత్రులు వ్యాఖ్యానించిన సంగతి తెలసిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో జగన్ పర్యటిస్తే కొందరు పసుపు నీళ్లు జల్లారని కూడా అంటారు. ఈ నేపథ్యంలోనే అమరావతి ప్రాంతం అంటే జగన్ కు అంత అయిష్టత అని కూడా అంటారు. పైగా.. చంద్రబాబు సామాజికవర్గం రైతులు కోసమే ఇక్కడ రాజధాని ఏర్పాటు ప్రయత్నం జరగిందని కూడా ప్రభుత్వం గతంలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ చూడని అమరావతి మొహం ఇప్పుడు జగన్ ఏకంగా కమిటీ వేసింది. 75 శాతం పూర్తైన భవనాలను పూర్తి చేసి.. మిగిలిన స్థలాలను, భవనాలను ప్రైవేటుకు అప్పగిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇన్ని మలుపుల మధ్య విశాఖలో రాజధని ఏర్పాట్లు జరుగుతూండగానే అమరావతిలోని భవనాల పరిశీలనపై గుసుగుసలు వినిపిస్తున్నాయి.
అప్పులతోనే నిర్మాణమా..?
అమరావతిని తాము కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే వార్తలూ లేకపోలేదు. అయితే.. 75 శాతం పూర్తైన భవనాలు మాత్రమే అంటే మిగిలిన వాటిని, భూములను ప్రభుత్వం పట్టించుకోనట్టే అనే వాదనలూ లేకపోలేదు. ఈ భవనాల నిర్మాణ వ్యయాన్ని కూడా బ్యాంకుల నుంచే పొందాలని సీఎం ఆదిత్యనాధ్ దాస్ సూచించారు. ఇప్పటికే ఎక్కువ అప్పులు చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీకి బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వకపోతే.. ఈ భవనాల పరిస్థితేంటి.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకంటుందనేది మరో ప్రశ్న. ఏపీ పరిస్థితి తెలసి బ్యాంకులు రుణాలిస్తాయా..? అనేది మరో ప్రశ్న. మరోవైపు విశాఖలో ఉధృతంగా జరుగుతున్న విశాఖ ఉక్కు ఉద్యమం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే అమరావతి అంశాన్ని తెరపైకి తెచ్చారనేది మరో వాదన. 75 శాతం పూర్తైన భవనాలను పూర్తి చేయడమంటే.. మిగిలిన వాటి సంగతేంటి అని ఇక్కడ మళ్లీ ఆందోళన పెరిగితే.. విశాఖ ఉక్కు నుంచి దృష్టి మరల్చొనీ.. తద్వారా విశాఖకు రాజధాని తరలింపుకు బ్రేక్ ఉండదని కూడా అంటున్నారు. మరి.. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏంటో.. ఏం చేయబోతోందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే..!