KCR: నూతన సచివాలయ ప్రారంభోత్సవం వేళ కేసిఆర్ సర్కార్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. 40 విభాగాల్లోని 5544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ ఉన్న తరుణంలో సీఎం కేసిఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇవేళ వారి క్రమబద్దీకరణకు అధికారికంగా ముద్ర వేశారు.

తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఆరో అంతస్తులోని తన చాంబర్ లో సీఎం కేసిఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పై సంతకం చేశారు. దీంతో సదరు కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం కేసిఆర్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
“నూతన సచివాలయ ప్రారంభోత్సవ వేళ శుభవార్త. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పై మొదటి సంతకం చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్ గారు. అందరికీ శుభాకాంక్షలు, ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసిఆర్ గారికి కృతజ్ఞతలు” అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు.