NewsOrbit
న్యూస్

‘వృద్ధి ఫలాలు అందరికీ అందాలి’

Share

అమరావతి, డిసెంబర్ 25: పెద్ద ఎత్తున సంపద సృష్టిస్తేనే పేదరికం నిర్మూలన సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం ఆయన రాష్ట్ర ప్రగతిపై మూడవ శ్వేతపత్రం  విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో సంక్షేమం కీలకమైనది. బాధల్లో వుండే వ్యక్తికి సంక్షేమం ముఖ్యం. సామాజిక కారణాలు, చారిత్రక, భౌగోళిక కారణాలతో చాలామంది పేదరికం, ఆర్థిక అసమానతలతో ఇబ్బందులు పడుతుంటారు. మేము అధికారంలోకి రాగానే పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. పాదయాత్రలో పేదల కష్టాలు నా కళ్లతో చూశాను. పేదలు జీవచ్ఛవాల్లా బతుకులీడుస్తున్న దృశ్యాలు నన్ను కలచివేశాయి.ఆర్థిక అసమానతలు ఉన్నంత వరకు, పేదలు ఆకలితో బాధలు పడే పరిస్థితులు ఉన్నంత వరకు సమాజంలో అభివృద్ధికి చోటుండదు. సంపద సృష్టించకుండా సమాజంలో పేదరికం పోదు. మనకుండే వనరులన్నీ ఉపయోగించుకుని పెద్దఎత్తున సంపద సృష్టించగలిగితే అప్పుడే పేదరికం తొలగిపోతుంది అని ఆయన అన్నారు.
అంబేద్కర్ స్ఫూర్తిగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తోంది. రూ.24 వేల కోట్లు రుణ విముక్తిచేశాం. ఆనాడు ఎలాంటి ప్రతిబంధకాలు ఉన్నా రైతు రుణ ఉపశమనం విషయంలో వెనకడుగు వేయలేదు. ఆ రోజు ఎన్‌టీ  రామారావు కిలో  రెండు రూపాయిలకు బియ్యం, చీర ధోవతి పంపిణీ కార్యక్రమాన్ని అమలుచేశారు. లైఫ్ సైకిల్ విధానాన్ని ప్రవేశపెట్టాం. బిడ్డ కడుపులో ఉన్న దశ నుంచి అంతిమ గడియల వరకు ప్రభుత్వం ప్రతి దశలోనూ సంక్షేమానికి సహకరిస్తోంది. కుటుంబ వికాసం, సమాజ వికాసం వంటి కార్యక్రమాలను అమలుచేస్తున్నాం. పెద్దఎత్తున పీడీఎస్ అమలు చేస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటే. పండగలొస్తే వివిధ వర్గాల వారికి కానుకలు అందిస్తున్నాం. పౌష్టికాహారం విషయంలో రాజీపడటం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్దఎత్తున చంద్రన్నబీమా అమలు చేస్తున్నాం. ఎన్టీఆర్ వైద్యసేవలు పెద్దఎత్తున అందిస్తున్నాం. రాష్ట్రంలో ఆరోగ్య వ్యయం గణనీయంగా తగ్గించగలిగాం. ఎంఎస్ఎంఈలు తీసుకొచ్చి స్వయం ఉపాధికి బాటలు వేశాం.
ఏ ఊర్లో అయినా పనిచేసుకునే వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాం. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్, టీవీ ప్రసారాలు అందిస్తున్నాం.
ఏ ప్రయోజనం కల్పించినా మహిళ పేరుతో అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. నెలకు కనీసం రూ.10 వేలు ఆదాయం సంపాదించేలా పేదరిక నిర్మూలనకు కృషిచేస్తున్నాం.
బడ్జెట్  సంక్షేమానికి పెద్దపీట వేశాం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేశాం. సమాజంలో అట్టడుగున వుండే వర్గాల వారికి భరోసా ఇస్తున్నాం. పేదరికంపై గెలుపు కార్యక్రమాన్ని తీసుకుని ఆర్థిక అసమానతల్ని తొలగిస్తున్నాం. ఉపకార వేతనాలు, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో కార్యక్రమాలను అమలుచేస్తున్నాం. రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను పెంచాం. నిధుల సమీకరణ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రజలకు సంతృప్తకర స్థాయిలో నిత్యావసరాల్ని అందిస్తూ ప్రజాపంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దాం. మధ్యాహ్న భోజన పథకంలో 66 శాతం సంతృప్త ఫలితాలు వచ్చాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్న క్యాంటీన్లను ప్రవేశపెట్టాం. జగ్జీవన్ రామ్ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ కల్పిస్తున్నాం.  చంద్రన్నబీమా పథకం క్లయిమ్స్‌లో 94 శాతానికి పైగా సంతృప్తస్థాయి ఫలితాలు వచ్చాయి. పెద్దఎత్తున ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నాం. నరేగా పనులలో అందరికీ ఉపాధి కల్పిస్తున్నాం. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ డ్వాక్రా మహిళలకు రుణాలిస్తున్నాం. పేదవాళ్లకోసం కష్టపడే ప్రభుత్వం ఇది. ఉపకార వేతనాల్ని పెంచాం. హాస్టల్లో విద్యార్థుకు కాస్మొటిక్ ఛార్జీలను పెంచాం.  విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు రూ.15 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తున్నాం. ఉద్యోగం, ఉపాధి కల్పించే కార్యక్రమాల్ని ఒకే గవాక్షం కిందకు తీసుకొచ్చాం.  రియల్‌టైమ్‌లో సంక్షేమ కార్యక్రమాల్ని, పథకాల్ని పర్యవేక్షిస్తున్నాం. మనం చేసిన కృషికి అనేక పురస్కారాలు లభించాయి. ఆదరణ పథకం కింద పెద్దఎత్తున పనిముట్లను అందిస్తున్నాం. ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువగా సంక్షేమాన్ని అమలుచేస్తున్నాం.
సుస్థిర వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. ప్రజల అవసరాల్ని ఎప్పటికప్పుడు గుర్తెరిగి వారి కష్టాలను తీరుస్తున్నాం.  సమాజంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. దానికి అనుగుణంగా దార్శనిక పత్రాన్ని రూపొందించుకున్నాం. నేను కష్టపడేది ఐదుకోట్ల ప్రజల కోసం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజమైన అభివృద్ధి‌ అంటే అన్ని వర్గాల ప్రజలూ సమానంగా అభివృద్ధి చెందడం అని నమ్ముతుంది. పెరుగుదల అర్ధవంతమైనదిగా ఒక క్రమంలో అసమానతలను తగ్గించేదిగా ఉండాలి. మన రాష్ట్ర అభివృద్ధి సంపూర్ణం కావాలంటే, షెడ్యూల్డ్ కులాలు,  షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, విభిన్న ప్రతిభావంతులు, మహిళలు, ఇతర సాంఘిక సమూహాలు, చారిత్రక కారణాలతో అభివృద్ధి అజెండాలో చోటు లేకుండా పోయినవారందరిపై ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి ఫలాలను, ప్రయోజనాలను పొందడానికి వారికి  సమాన హక్కు ఉంది అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

 

శ్వేతపత్రం పూర్తి పాఠం కొరకు ఈ కింద క్లిక్ చేయండి

5_6129791936329941100


Share

Related posts

జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్ధులు

somaraju sharma

Poonam Kaur: “పికే లవ్” పూనం కౌర్ సోషల్ మీడియాలో వైరల్ కామెంట్లు..!!

sekhar

Bigg Boss 5 Telugu: ఈవారం ఈ ఇద్దరు కంటెస్టెంట్ లు అవుట్… నాగార్జున సంచలన నిర్ణయం..??

sekhar

Leave a Comment