NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

T Congress: అలూలేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అంటే ఇదేనేమో.. సీఎం పదవిపై సీనియర్‌ల ఆశలు

Share

T Congress: తెలంగాణలో ఎన్నికల వేడి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఒకే సారి వంద మందికిపైగా అభ్యర్ధులను అధికార బీఆర్ఎస్ ప్రకటించి ముందు వరుసలో ఉండగా, వాటిలో సగం స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రకటించింది. బీజేపీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తొంది. ఇప్పటికే అభ్యర్ధులు ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తున్నారు. సీఎం కేసిఆర్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి ఎన్నికల సభల్లో ప్రసంగాలు చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకుని హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని బీఆర్ఎస్ భావిస్తొంది. అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ సర్వశక్తులను ఒడ్డుతోంది.

కర్ణాటక ఎన్నికల్లో గెలుపు ఊపుతో తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న ధీమా కాంగ్రెస్ లో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న తాము రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తామని బీజేపీ ఆశపడుతోంది. డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం తెలంగాణలో సభల్లో పాల్గొని ప్రసంగిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సీఎం అభ్యర్ధుల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీలో దాదాపు కేటిఆర్ అనే పేరు వినబడుతోంది. కేసిఆర్ లేదంటే కేటీఆర్.

Revanth Reddy

జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలో సీఎం అభ్యర్ధుల ప్రకటన ముందుగా చేసే అవకాశం లేదు. కాంగ్రెస్, బీజేపీలో సీఎం పదవిని ఆశిస్తున్న వారిలో అరడజను మందికిపైగానే ఉన్నారు. ఈ రెండు పార్టీల్లో పలువురు సీనియర్ నాయకులు అయితే పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పదవికి తాము అర్హులమే అనే వాళ్ల ఉన్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో పాటు వి హనుమంతరావు, మల్లు భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ తదితరులు ఉన్నారు.

సీఎం రేసులో ఉన్నందునే పార్లమెంట్ సభ్యులైన రేవంత్ రెడ్డి కోడంగల్లు నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి హూజూర్ నగర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో కొడంగల్లు నుండి పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుండి గెలుపొందారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి గెలిచారు. ఉత్తమకుమార్ రెడ్డి మాత్రం హూజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించినా పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నల్లగొండ పార్లమెంట్ స్థానం నుండి గెలుపొందారు. ఈ ముగ్గురు పార్లమెంట్ సభ్యులు సీఎం రేసులో ఉన్నందునే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారనేది టాక్.

సీనియర్ నేత జానారెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన కుమారుడు నాగార్జున సాగర్ నుండి పోటీ చేస్తున్నారు. జానారెడ్డి రెండు టికెట్లు డిమాండ్ చేసినా పార్టీ అధిష్టానం ఒక టికెటే కేటాయించింది. బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీలోనే సీఎం పదవి ఆశిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. నాకేమిటి తక్కువ అనే నేతలు పుష్కలంగా ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టనంత వరకూ కాంగ్రెస్ పార్టీ నుండి అనేక మంది నాయకులు అధికార బీఆర్ఎస్ లోనూ, కొందరు బీజేపీలోనూ చేరారు. రేవంత్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ లో కొంత ఊపు వచ్చిందని అంటారు. ఆ క్రమంలోనే కాంగ్రెస్ లో చేరికలు జరుగుతూ వచ్చాయి. దానికి తోడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు మరింత ఊపు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ హెచ్చరికలతో విభేధాలను పక్కన పెట్టి కలసి పని చేయాలని నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు.

బీఆర్ఎస్ ను ఢీకొనే శక్తి కాంగ్రెస్ కే ఉంది అన్న రీతిలోకి తీసుకువచ్చారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ కూడా ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ అన్నట్లుగానే టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగిస్తున్నారు. ఓ పక్క కాంగ్రెస్ పార్టీలో సీట్ల కేటాయింపు లొల్లి జరుగుతోంది. టికెట్ రాని నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. బీసీ కార్డు ఉపయోగిస్తూ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు కానీ సీఎం పదవిపై సీనియర్ నేతలు కలలు కంటున్నారు అనడానికి ఇది ఉదాహరణగా నిలుస్తుంది.

సీఎం పదవిపై ఓ నేత తన మనసులో మాట బహిరంగంగా చెప్పేశారు. ఆయన ఎవరో కాదు సీనియర్ నేత జానారెడ్డి.  నల్లగొండ జిల్లా గుర్రంపోడు లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల హృదయాల్లో తాను సీఎం కావాలని ఉందని అన్నారు జానారెడ్డి. తనకు తానుగా ఏ పదవీ కోరడం లేదని అంటూనే సీఎం అయ్యే అవకాశం హఠాత్తుగా రావచ్చేమో అని వ్యాఖ్యానించారు. ఏ పదవి వచ్చినా తాను కాదనని చెప్పారు. ఇదే సందర్భంలో తన అనుభవాన్ని వివరించారు జానారెడ్డి.

ఏ సీఎం చేయనన్ని శాఖలను తాను నిర్వహించాననీ, 21 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చి 36 ఏళ్లకే మంత్రిని అయ్యానని తెలిపారు. తనకు 55 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పారు. తనకు ఏ పదవులు అయినా వాటంతట అవే వచ్చాయని జానారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జానారెడ్డి మాత్రం బహిరంగంగా తన మనసులోని మాట చెప్పారు. ఇంకా ఎంత మంది నాయకులు తమ నియోజకవర్గంలో, రాష్ట్రంలో ప్రజలు సీఎంగా చూడాలని కోరుకుంటున్నారని చెబుతారో చూడాలి మరి. ఆలూ లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అనే సామెత మాదిరిగా ఉందని పలువురు సెటైర్ లు వేస్తున్నారు.

Chandrababu Arrest: చంద్రబాబు లీగల్ ములాఖత్ లకు అధికారులు కోత .. డీఐజీకి వినతి పత్రం ఇచ్చిన టీడీపీ నేతలు


Share

Related posts

Bypoll Results: ఆ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ‘నోటా’నే సెకండ్ ప్లేస్ .. ఎక్కడంటే..?

somaraju sharma

కెసిఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్.. కలిసి వచ్చే పార్టీలు ఇవే..?

somaraju sharma

లీకులతో వకీల్ సాబ్ కి భారీ నష్టం ..?

GRK