మన్యం గజగజలాడుతోంది!

విశాఖ మన్యం చలికి గజగజలాడుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో చలి ఎముకలను కొరికేస్తున్నది. మన్యం వ్యాప్తంగా సాధారణం కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.లంబసింగిలో జీరో డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.ఇలా ఉండగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ చలి వణికించేస్తున్నది. చలిగాలుల తీవ్రత పెరిగింది.

ఇటీవల వరుస తుపానుల కారణంగా వాతావరణం అనూహ్యంగా చల్లబడింది. దానికి తోడు చలిగాలులు పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాలలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల తక్కువగా నమోదౌతున్నాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో కూడా పొగ మంచు కారణంగా జనం బయటకు రావడానికి జంకే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది.