చలి చంపేస్తోంది!

తెలుగు రాష్ట్రాలలో చలి చంపేస్తోంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా సాధారణం కంటే ఐదు నుంచి ఆరు డిగ్రీల వరకూ తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. గత వారం రోజులుగా రోజు రోజుకూ చలి తీవ్రత పెరుగుతూ వస్తున్నది. ఉత్తరాది నుంచి వచ్చే చలిగాలుల తీవ్రత పెరుగుతుండటంతో మరో నాలుగైదు రోజులు ఈ పరిస్థితి తప్పదని వాతావరణ శాఖ చెబుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఉదయం పది గంటలకు కూడా బయటకు రాలేని పరిస్థితి ఉంది.

అదే విధంగా విశాఖ మన్యం లో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. లంబసింగిలో సున్నా డీగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ కూడా చలి తీవ్రత బాగా పెరిగింది. దట్టమైన పొగమంచుతో రోడ్లపై ఎదురుగా ఏమి వస్తున్నదోకూడా తెలియని పరిస్థితిని వాహనదారులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 గంటల సమయంలో కూడా వాహనాల హెడ్ లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. తీవ్రమైన చలి కారణంగా శ్వాస సంబంధ రుగ్మతలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలి నుంచి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

SHARE