వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి బిగ్ బాస్ కు బోనస్ లాంటివి. ఎప్పుడైతే షో డల్ అవుతోంది అనిపిస్తుందో అప్పుడు వైల్డ్ కార్డ్ ను సాధారణంగా ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. బిగ్ బాస్ సీజన్ 1 లో నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ షో కు ఎంతలా ప్లస్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అప్పటిదాకా ఓ మాదిరిగా సాగుతున్న షో కాస్తా నవదీప్ రాకతో మరో రేంజ్ కు వెళ్ళింది. ఇక బిగ్ బాస్ సీజన్ 2,3 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంతగా ప్లస్ అవ్వలేదు.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 నడుస్తోంది. 16 మందితో మొదలైన ఈ షో లో ఈరోజు ఫస్ట్ ఎలిమినేషన్ ఉండనుంది. ప్రస్తుతం నలుగురు నామినేషన్స్ లో ఉన్నారు. మెహబూబ్, అఖిల్, సూర్య కిరణ్, దివి నామినేషన్స్ లో ఉండగా సూర్య కిరణ్ ఎలిమినేట్ కాబోతున్నారు అంటూ ఇప్పటికే సమాచారం అందింది. ఇక ఎలిమినేట్ అయిన సూర్య కిరణ్ స్థానంలో త్వరలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండనుందని సమాచారం. బిగ్ బాస్ లో ఇంత త్వరగా సెకండ్ వీక్ లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది అరుదు. అయితే షో ను మరింత రక్తి కట్టించడం కోసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్నారు. ఒక మేల్ కంటెస్టెంట్ వెళ్లిపోతుండడంతో మరో మేల్ కంటెస్టెంట్ నే వైల్డ్ కార్డ్ గా దింపబోతున్నారని తెలుస్తోంది.
అతను మరెవరో కాదు కమెడియన్ కుమార్ సాయి. మారుతి సినిమా ఈ రోజుల్లోతో పరిచయమైన కుమార్ సాయి, ఎక్కువగా ఆయన సినిమాల్లోనే కనిపించాడు. కమెడియన్ గా పలు సినిమాల్లో నటించినా బిగ్ బ్రేక్ రాలేదు. నెమ్మదిగా ఫెడౌట్ అయిపోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా కెరీర్ ను మలుపు తిప్పుకోవాలనుకుంటున్నాడు కుమార్ సాయి. మరి అతని ఎంట్రీ ఏ విధంగా బిగ్ బాస్ కు ప్లస్ అవుతుందో, తనకు బిగ్ బాస్ ఏ విధంగా ప్లస్ అవుతుందో చూడాలి.