తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు మంత్రుల విషయంలో సీరియస్‌గా ఉన్నారా? వారిద్దరి మధ్య అసంతృప్తిని గమనించి సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేదని భావిస్తున్నారా?
అంటే అవుననే సమాధానం వస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మధ్య విబేధాల నేపథ్యంలో ఈ చర్చ తెరమీదకు వస్తోంది.
ఆ ఇద్దరు మంత్రుల మధ్య….
కొంతకాలంగా జిల్లాలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మధ్య ఆధిపత్య పోరునడుస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ ఎమ్మెల్యేలు మంత్రి నిరంజన్ రెడ్డి పక్షాన నిలిచారు. తనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను జత కట్టాడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. టైం కోసం ఎదురు చూసి కేటీఆర్ టూర్ సమయంలో మంత్రి నిరంజన్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలపై శ్రీనివాస్ గౌడ్ కసి తీర్చుకున్నారని పార్టీ లీడర్లు చెప్తున్నారు.
కేటీఆర్ సమక్షంలోనే
ఇద్దరు మంత్రుల మధ్య విబేధాలకు గతంలోనే బీజాలు పడ్డట్లు సమాచారం. జులై 13న మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ లో పర్యటించారు. ఆ టైంలో జిల్లాలోని ఆధిపత్య పోరు బయటపడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జిల్లాకు వచ్చిన సందర్బంగా జిల్లాలోని మరో మంత్రి నిరంజన్ రెడ్డి, మిగతా ఎమ్మెల్యేలను ప్రోగ్రాంకు ఆహ్వానిస్తారని అందరూ భావించారు.
కాని శ్రీనివాస్ గౌడ్ మాత్రం ఇతరులను ఆహ్వానించలేదని సమాచారం. కేవలం లోకల్ లీడర్ల సమక్షంలోనే కేటీఆర్ తో మహబూబ్ నగర్ టీచింగ్ హాస్పిటల్, కేసీఆర్ పార్కు, కేటీఆర్ కాలనీ ప్రారంభించారు.
దీంతో షాక్ తిన్న ఎమ్మెల్యేలు, ఉమ్మడి మహబూబ్‌నగర్ మంత్రులు లంచ్ సమయంలో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. మరోవైపు శ్రీనివాస్ గౌడ్ తీరుపై ఆగ్రహంగా ఉన్న జిల్లాకు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యని సమాచారం. మంత్రి తమను అవమాన పరిచారని సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. విషయాన్ని కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే ఓ నేతకు వివరించారు.
కేసీఆర్ కూడా డీల్ చేయలేకపోయారా?
ఇలా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మధ్య విబేధాలు రచ్చకెక్కిన నేపథ్యంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ ఓ ప్లాన్ వేశారు. ఈ ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించాలని ఆయన ఆదేశించారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి పనుల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే, ఈ ప్లాన్ వర్క్ అవుట్ కాలేదని పార్టీ వర్గాల సమాచారం. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు వెళ్లారే తప్ప విభేదాలు అలాగే ఉన్నాయనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలను పోగొట్టుకోవాలని, కలిసి పని చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.