తెలంగాణలో రాజకీయ పరిణామాలపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం అయ్యాయి. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాదని తెగేసి చెప్పేశారు. రాష్ట్రంలో వచ్చేది హంగ్ అసెంబ్లీయేనని అన్నారు కోమటిరెడ్డి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ కారణాల వల్ల సీనియర్ నేతలు ఒకే వేదికపైకి రాలేకపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. తమ పార్టీ నేతలు అందరూ కలిసి కష్టపడితే 40 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు కోమటిరెడ్డి. పార్టీ లోని ఏ ఒక్కరితో కాంగ్రెస్ కు అన్ని సీట్లు రావని పరోక్షంగా పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి అన్నారు.

తానే గెలిపిస్తా అంటే .. మిగిలిన వాళ్లు ఇంట్లోనే కూర్చుంటారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్లు రావని పేర్కొన్నారు. అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ మరో పార్టీతో కలవాల్సిందేనని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ సెక్యులర్ పార్టీలనీ, కాంగ్రెస్ తో కేసిఆర్ కలవక తప్పదని తెలిపారు. అందుకే కేసిఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారని ప్రస్తావించారు. కొత్త అయినా, పాత అయినా గెలిచే వాళ్లకే సీట్లు ఇవ్వాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడతానని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత పొత్తులు తప్పవని అన్నారు.
ఇక తన ఎన్నికల ప్రచార విషయంపై మాట్లాడుతూ స్టార్ క్యాంపెయినర్ అయిన తాను ఒక్క జిల్లాలోనే ఎందుకు తిరుగుతానని ప్రశ్నించారు. మార్చి మొదటి వారం నుండి పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపారు. పాదయాత్ర ఒక్కటే కాదు.. బైక్ పై కూడా ఇతర జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. పాదయాత్ర రూట్ మ్యాప్ పై పార్టీ అనుమతి తీసుకుంటానని కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన సంచలన కామెంట్స్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.