Telangana Elections: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ మాటల మాంత్రికుడే కాదు. రాజకీయంగా అపరచాణిక్యుడు. ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్లడం కేసిఆర్ ప్రత్యేకత. కేసిఆర్ తన మాటలతో నాడు సోనియా గాంధీనే బురిడి కొట్టించాడని అంటారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పడంతో తెలంగాణలో అధికారం సుస్థిరం అనుకుని ఆంధ్ర ప్రజా ప్రతినిధులు వ్యతిరేకించినా రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా రెండు ముక్కలు చేసేసింది నాటి సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ సర్కార్. రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత కేసిఆర్ కాంగ్రేస్ వైపు కూడా చూడలేదు. అధికారంలోకి రాగానే దళితుడిని సీఎం చేస్తానని ఇచ్చిన హామీని తీసి గట్టు మీద పెట్టారు.
ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని పూర్తిగా తగ్గించేందుకు ఆ పార్టీ నుండి గెలిచిన మెజార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారు. అంతే కాకుండా తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఎదగకుండా చేయడంలో తన వ్యూహాలను అమలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే కేసిఆర్ స్ట్రాటజీలు అలా ఉంటాయి అని చెప్పడం కోసం. గత ఏడాది జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లోనూ అటువంటి స్ట్రాటజీనే ఉపయోగించారు కేసిఆర్. మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్షాల మద్దతు లేకపోతే బీఆర్ఎస్ అభ్యర్ధి గెలిచే పరిస్థితి లేదు. ఇది గమనించిన కేసిఆర్ .. వామపక్ష నేతలతో మాట్లాడి పొత్తు రాజకీయం చేశారు.
మీకు, నాకు ఉమ్మడి శతృవు బీజేపీ. మీరు మద్దతు ఇవ్వకపోతే బీజేపీ గెలుస్తుంది, ప్రభుత్వం, పార్టీ ద్వారా మీకేమైనా డిమాండ్ లు ఉంటే వాటిపై సానుకూల నిర్ణయం తీసుకుంటానని కేసిఆర్ హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ అభ్యర్ధిగా వామపక్ష నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. అదే సందర్భంలో ఈ పొత్తు మునుగోడు ఉప ఎన్నికల వరకే కాదనీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని పేర్కొన్నారు కేసిఆర్. దీంతో బీఆర్ఎస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై బీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి 10,309 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వాస్తవానికి మునుగోలు నియోజకవర్గంలో ఉభయ కమ్యూనిస్టులకు 20వేలకుపైగా ఓట్ల బలం ఉంది. మునుగోడులో కుదిరిన పొత్తు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉంటుంది, ఎన్నో కొన్ని సీట్లు బీఆర్ఎస్ పొత్తులో భాగంగా ఇస్తుందని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఆశించారు. కానీ ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న సామెతగా మునుగోడు ఉప ఎన్నికల తర్వాత వామపక్ష నేతలను కారు దింపేశారు కేసిఆర్.
కామ్రెడ్స్ కు కేసిఆర్ హ్యాండ్ ఇవ్వడంతో అయోమయంలో పడ్డారు. అయితే తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో వామపక్షాలకు 5 నుండి పది వేల వరకూ ఓటు బ్యాంక్ ఉంది. ఇది గమనించిన కాంగ్రెస్ వామపక్షాలకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సిద్దమైంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు ఉండటంతో పొత్తుపై అవగాహన కుదిరింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై అవగాహన కుదిరిందని సీపీఐ సీనియర్ నేత నారాయణ దృవీకరించారు. అయితే సీట్ల అంశంపై ఇంకా తేలలేదు. కమ్యూనిస్టులకు చెరో రెండు సీట్లు అని ప్రచారం జరుగుతుంది. అయితే సీట్ల అంశం రెండు రోజుల్లో కొలిక్కి వస్తుందని, చెరో రెండు సీట్లు అన్నది ప్రచారం మాత్రమేనని నారాయణ పేర్కొన్నారు. కాంగ్రెస్ నుండి అలాంటి ప్రతిపాదన ఇంకా రాలేదన్నారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నాయనీ, తెలంగాణలోనూ ఆ తరహా రాజకీయ అవగాహన తో ముందుకు వెళతామని నారాయణ తెలిపారు.
Chandrababu Arrest: బాబుకు బ్యాడ్ డే ..ఏసీబీ కోర్టులోనూ లభించని ఊరట