Maa Elections: మా ఎన్నికలు Maa Elections అధ్యక్ష పదవికి తాను పోటీ చేస్తున్నట్టు ప్రకాశ్ రాజ్ ప్రకటించడమే సంచలనం రేపింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ ప్రముఖులు అలెర్ట్ అయిపోయారు. తనయుడు మంచు విష్ణు మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు మోహన్ బాబు ప్రకటించడం జరిగిపోయింది. వెంటనే జీవిత, హేమ.. కూడా పోటీలో ఉంటున్నామని ప్రకటించారు. ప్రాంతీయ నేపథ్యంలో సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు కూడా పోటీలో ఉన్నారు. ఇంతగా హీటెక్కిన ఈ మా ఎన్నికలకు కేంద్ర బిందువుగా ప్రకాశ్ రాజ్ నిలిచారు. ఆయన పోటీ చేయడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన కన్నడిగుడు కావడమే ఇందుకు కారణం. హిందూ సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం విశేషం.
మా ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం ఉందని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఇప్పుడు హిందూ సంఘాలు వచ్చాయి. ప్రకాశ్ రాజ్ పోటీ చేసే విషయమై తీవ్రంగా తప్పుబడుతున్నాయి. కన్నడ పరిశ్రమకు చెందిన ప్రకాష్ రాజ్ ను నటుడిగా గౌరవిస్తాం, అభిమానిస్తాం గానీ.. టాలీవుడ్ పై పెత్తనం చేస్తామంటే ఒప్పుకోం అంటున్నాయి. ప్రకాశ్ రాజ్ హిందువుల వ్యతిరేకి. గతంలో హిందువులను కాకులతో పోల్చాడు. హిందూ కళాకారులకు అన్యాయమే చేస్తాడు. ఆయనకు ఓటు వేస్తే మిమ్మల్ని మీరూ కాకులుగా ఒప్పుకున్నట్లే..! ‘మా’ లో కాకులు లేవనే భావిస్తున్నాం. ప్రకాష్ రాజ్ సొంత రాష్ట్రంలోనే తిరస్కరణకు గురైన వ్యక్తి. ఆయన మద్ధతుదారులు ఈ విషయంలో పునరాలోచించాలి. ఇది హిందువులు, తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం’ అని హిందూ సంఘాల నాయకుడు దుర్గా శ్రీరామ్ అన్నారు.
Read More: Prakash Raj: నేను నాన్ లోకలా..? ఇన్నాళ్లూ గుర్తు రాలేదా..? ప్రకాశ్ రాజ్ ప్రశ్నలు
దీంతో రోజురోజుకీ ప్రకాశ్ రాజ్ పోటీ విషయం తీవ్ర రూపం దాలుస్తోంది. ఇటివల మంచు విష్ణు రాసిన బహిరంగ లేఖలో కూడా.. ‘మన ఇల్లు మనమే బాగు చేసుకుందాం’ అని అన్నారు. ఇది ప్రకాశ్ రాజ్ కు ఇన్ డైరక్ట్ పంచ్ అనే కామెంట్లు వచ్చాయి. అయితే.. ప్రకాశ్ రాజ్ కు మెగా కాంపౌండ్ మద్దతు ఉందనే వాదన వినిపిస్తోంది. చిరంజీవి ప్రత్యక్షంగా రాకపోయినా.. నాగబాబు మాటలు ఇదే నిజమని నిరూపిప్తున్నాయి. ఇప్పటికే మా ఎన్నికల్లో లోకల్-నాన్ లోకల్ ఇష్యూ బాగా హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ విషయం, మా ఎన్నికలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చూడాల్సి ఉంది.