ఆదిలాబాద్ కాంగ్రెస్ లో వర్గపోరు కారణంగా బీసీ ఐక్య వేదిక రసాభాసగా మారింది. సీనియర్ నేత వీహెచ్ సమక్షంలోనే సాజిద్ ఖాన్, కంది శ్రీనివాస్ రెడ్డి వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇటీవల ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీన్ని సాజిత్ ఖాన్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ విషయంపై ఇరువర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇవేళ జరుగుతన్న సభలో ఇరువర్గాలు వాగ్వివాదానికి దిగాయి.

అది కాస్త తపులాటకు దారి తీసింది. కంది శ్రీనివాస్ రెడ్డి వీహెచ్ మీదకు వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. సభావేదిక నుండే తనపై దౌర్జన్యం జరగడంపై వీహెచ్ ప్రియాంక గాంధీకి ఫోన్ చేసి ఇక్కడి విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం. సమావేశంలో తోపులాట జరగడంతో విహెచ్ అక్కడి నుండి వెళ్లిపోయారు. బీసీ ఐక్య వేదికలో సీనియర్ నేత విహెచ్ ను అడ్డుకోవడాన్ని పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తొంది. కంది శ్రీనివాస్ రెడ్డిపై డీసీసీ చర్యలు తీసుకోవాలని నేతలు సూచించినట్లు సమాచారం.