దేశవ్యాప్తంగా శనివారం కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభమైంది. వ్యాక్సిన్ పంపిణీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించడమే లక్ష్యంగా ఈ డ్రై రన్ సాగనుంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం డ్రై రన్ నిర్వహించింది. ఇప్పుడు మిగిలిన.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డ్రై రన్ జరగుతోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలోనూ డ్రై రన్ నిర్వహిస్తున్నారు.
ఏపీలో ముప్పై తొమ్మిది చోట్ల!
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో వ్యాక్సిన్ డ్రై రన్ జరుగుతోంది. ఏపీలోని ఒక్కో జిల్లాలో మూడు చోట్ల చొప్పున, మొత్తంగా 39 ప్రాంతాల్లో డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఒక్కో సెంటర్‌లో 25 మంది హెల్త్ వర్కర్లకు డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు. ఎంపిక చేసిన వారికి ముందుగానే మెసేజ్ లు పంపి వారిని సన్నద్ధం చేశారు .ఒక్కో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌తో పాటు ఏరియా ఆసుపత్రుల్లో డ్రై రన్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు.
తెలంగాణలో ఆరు చోట్ల!
తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహిస్తోంది. కరోనా టీకా డ్రై రన్ కోసం మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు చోట్ల డ్రై రన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో 3 సెంటర్లలో వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహిస్తున్నారు.
తిలక్‌నగర్ పీహెచ్‌సీ, నాంపల్లి ఏరియా ఆసుపత్రి, సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఈ ప్రక్రియ సాగుతోంది.ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ ఈ ప్రక్రియ సాగుతుంది. లబ్ధిదారులు వ్యాక్సిన్ కేంద్రానికి వచ్చేలా సమీకరించడం.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వరుసల్లో నిలబెట్టడం, వారి సమాచారాన్ని కో-విన్ యాప్‌లో నమోదు చేయడం.. లాంటివి చేస్తారు. ఈ సందర్భంగా ఎదురయ్యే సమస్యలను కేంద్రానికి పంపుతారు.