ఇండియాలో ఉచిత కరోనా వ్యాక్సిన్… ఇంతకీ వీళ్ళని నమ్మొచ్చా?

ఈ కరోనా కష్టకాలంలో జనాలు ఎదురు చూస్తున్నది ఒకే ఒక్క దానికోసం. అదే కరోనా వ్యాక్సిన్. గత కొద్ది నెలల నుండి ఆ స్టేజి లో ఉంది…. ఈ దశలో ఉంది అని ఊరిస్తున్న ఈ వ్యాక్సిన్ బయటకు వచ్చేందుకు సరిగ్గా ఎంత సమయం పడుతుందో తెలియదు కానీ అప్పుడే దీనిపై రాజకీయాలు మొదలైపోయాయి

 

బీజెపి మొదలెట్టింది….

వివరాల్లోకి వెళితే బీహార్ ఎన్నికల వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ తమను అధికారంలోకి తీసుకుని వస్తే ప్రజలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ప్రపంచం మొత్తం చుట్టి ఎంతో మంది ప్రాణాలు తీసుకున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఇవ్వడమే ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్న ఏకైక హామీ గా బిజెపి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు ఇదే అస్త్రాన్ని మిగతా పార్టీలు కూడా ప్రయోగిస్తున్నాయి.

వీళ్ళూ అదే బాటలో….

ఇక తమిళనాడు విషయానికి వస్తే…. వచ్చే సంవత్సరం ఆరంభంలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే మేము కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని అన్నాడీఎంకే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి తమిళనాడు సీఎం పళని స్వామి ప్రకటించారు. బిజెపి వారు మేనిఫెస్టోను విడుదల చేసిన కొద్ది గంటలకే తమిళనాడు ముఖ్యమంత్రి కూడా అదే రీతిలో ప్రకటన చేయడం విశేషం. ఇక వ్యాక్సిన్ అందుబాటులోకి రాకముందే రాజకీయ పార్టీలన్నీ దాని వెంట పడ్డాయి. ఉచితంగా వ్యాక్సిన్ ను అందజేస్తామని హామీల పై హామీలు ఇస్తున్నారు. ఇక ఈ హామీలను వీరు ఏ రకంగా వాడుకుంటారు…. ఇవి ఎంతవరకు జనాల్లో పనిచేస్తాయి అన్నది ఇంకా తెలియాలి.

వారికేనా…?

ఇదంతా పక్కన పెడితే చాలా మంది ప్రజలు ఈ తరహా హామీలు చూసి నోళ్లు తెరుస్తున్నారు. ప్రజల్లో ఉండే భయాలను, బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి రాజకీయనాయకులు ఆడుతున్న నాటకాలను చూసి వీరు ఎప్పటికీ మారరు అన్నట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ వారు ఇలా మేము అధికారంలోకి వస్తే బీహార్ రాష్ట్రం అంతా వ్యాక్సిన్ ఉచితం అని చెప్పినప్పుడు భారత దేశంలో మిగతా రాష్ట్రాలకు ఎటువంటి హామీలు ఎందుకు ఇవ్వలేదు ఇవ్వట్లేదు అని ప్రశ్నిస్తున్నారు.

కేవలం ఎన్నికల కోసమే ఇలా ఒక రాష్ట్రం మొత్తానికి ఉచితంగా వ్యాక్సిన్ పంచిపెట్టడం మిగతా రాష్ట్రాలకు మెండిచేయి చూపించడం అనేది ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. కేవలం రాజకీయాల కోసం ఇటువంటి వాగ్దానాలు చేసే రాజకీయ నాయకులను నిజంగా నమ్మాలా అన్న ప్రశ్న ఇప్పుడు అందరికీ ఎదురవుతుంది.