బీజేపీ నుండి దేవేగౌడకు ఖరీదైన కారు !

 

దేవేగౌడ అందరికి తెలిసిన సీనియర్ రాజకీయ నాయకుడు, జనతాదళ్ [సెక్యూలర్] పార్టీకి చెందిన దేవేగౌడ భారతదేశ 11 వ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అంతకు ముందు 1994 డిశంబరు నుండి 96 మే వరకు కర్ణాటక రాష్ట్రానికి  ముఖ్యమంత్రిగాను ఆయన సేవలు అందించారు. కర్ణాటక రాష్ట్ర రాజకీయాలలో భీష్మా చార్యులుగా గుర్తింపు పొందిన దేవేగౌడ ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.  ఇప్పడు ఇందంతా ఎందుకు అనుకుంటున్నారా… ఆయన భారత దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించినందుకు గాను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఒక ఖరీదైన కారును అందిస్తుంది.

మాజీ ప్రధాని దేవేగౌడ రాజ్యసభకు ఎన్నికైన కొత్తలో తనకు కారు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన కోరికకు  కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రానికి చెందిన దేవేగౌడ ప్రధానిగా సేవలు అందించినందుకు గాను గౌరవించుకోవాల్సిన బాధ్యత  తమ ప్రభుత్వం పై ఉందని బావించింది.

అందుకే ఖరీదైన కెఎ జి 3636 అనే నెంబరు గల ఓల్వా కారు ను అందజేయడానికి సిద్దం చేసింది. దేవేగౌడకు అధికారికంగా ఈ కారును త్వరలో అందజేస్తామని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. సుమారు 75 లక్షల ఖరీదైన కారును ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ప్రజాప్రతినిధులకు కేటాయించలేదని సమాచారం. అయితే  కారు ఖరీదు   75 లక్షలు కాగా ప్రభుత్వమే దీనిని కొనుగోలు చేయడం వలన రాయితీలు పోను 65 లక్షల కే లభించిందని తెలుస్తుంది.