జగన్ కు నిద్ర పట్టనివ్వని మండలి : రగిలిపోతున్న వైస్సార్సీపీ నాయకులు

 

అరుపులు.. కేకలు… వెక్కిరింతలు… జయము జయము చంద్రన్న లాంటి విషయాలన్నీ పక్కన పెట్టి శాసనసభ నుంచి కాస్త శాసన మండలికి రండి… అక్కడ అసలైన రాజకీయం జరుగుతోంది. పెద్దల సభలో అధికార పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి. కీలకమైన బిల్లులకు పెద్దల సభలో బ్రేకులు పడటం, దాని తర్వాత మంత్రుల అసహనముతో రగిలిపోవడం…. పోరా అంటే పోరా అనే స్థాయి వరకు వెళ్లడం… అబ్బో ఒకటేమిటి?? ఎన్నో ఎన్నెన్నో మండలిలో జరుగుతున్నాయి. తాజాగా ప్రభుతవం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పురపాలక చట్టాల సవరణ బిల్లు కు మండలి మోకాలడ్డింది. బిల్లు ఆమోదించేది లేదంటూ తెదేపా, పిడిఎఫ్ సభ్యులు బిల్లును వ్యతిరేకించడంతో బలం లేని అధికార పక్షం… తెదేపా సభ్యులపై మండిపడుతూ బూతు పురాణం అందుకోవడం విశేషం.

ఇది మూడోసారి !!

శాసనమండలి ప్రభుత్వ బిల్లులను అడ్డుకోవడం ఇది మూడోసారి. మొదట మూడు రాజధానుల బిల్లు, రెండోసారి ఎస్సి కమిషన్, 1 వ తరగతి నుంచి 6 వరకు ఇంగ్లీష్ మీడియం మీద తీసుకువచ్చిన బిల్ లను మండలి అడ్డుకుంది. ఇప్పుడు తాజాగా మున్సిపల్ బిల్ మండలి అడ్డుకుంది. మొదట బిల్లులను అడ్డుకున్నపుడే సీఎం జగన్ మండలి రద్దుకు ప్రతిపాదించారు. మండలిలో తెదేపా బలంతో పాటు వామపక్ష పార్టీ అనుబంధ సభ్యులు ఎక్కువగా ఉన్నారు. దింతో ప్రతిసారి ఇబ్బంది పెడతారు అనే కోణంలో మండలి రద్దు చేస్తామని శాసనసభలోని జగన్ ప్రకటించారు. అయితే దీని తర్వాత పలుమార్లు ఢిల్లీ పెద్దలపై మండలి రద్దు గురించి మాట్లాడినా… అదేమీ చిన్న విషయం కాదని, దీనికి ఢిల్లీ పెద్దలు ఏ మాత్రం సుముఖంగా లేరని తెలియడంతో పాటు, లీగల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జగన్కు బోధపడటంతో మండలి రద్దు విషయాన్నీ పక్కన పెట్టారు. అంతేకాదు ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన కొందరు నేతలకు ఎమ్మెల్సీల హామీ ఇచ్చారు. అప్పటికి అప్పుడు హడావుడిగా ఏ మాత్రం ఆలోచించకుండా ఎమ్మెల్సీలుగా ఉన్న ఇద్దరు మంత్రులను రాజీనామా చేయించిన జగన్ తర్వాత అది ఎంత కష్టమైన పని అన్నది తెలుసుకుని మిన్నకుండిపోయారు.

బలం పెరిగేది ఎప్పుడూ?

ప్రత్యక్ష ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యే ల బలం సాధించిన వైస్సార్సీపీ కు మండలాలు రామరామ మెజారిటీ మాత్రమే ఉంది. 58 మంది సభ్యులున్న ఏపీ శాసనమండలిలో వైసీపీకి ఉన్న బలం 11 మంది మాత్రమే. కానీ విపక్ష టీడీపీకి దాదాపు 30 మంది వరకూ ఉన్నారు. దీంతో వైసీపీ కీలక బిల్లులను నెగ్గించుకునే విషయంలో ప్రతిసారి అడ్డంకులు ఎదుర్కుంటోంది. ఈ ఏడాది జనవరిలో కీలకమైన మూడు రాజధానుల బిల్లును ఓసారి అడ్డుకుని సెలక్ట్‌ కమిటీకి పంపిన మండలి, ఆ తర్వాత రెండోసారి విజయవంతంగా అసలు చర్చకే రాకుండా అడ్డుకోగలిగింది. ఇంగ్లీష్‌ మీడియం, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజన బిల్లులను కూడా ఇదే తరహాలో మండలి అడ్డుకుంది. ఇప్పుడు తాజాగా పురపాలక చట్ట సవరణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును కూడా టీడీపీ ఇతర విపక్షాలతో కలిసి అడ్డుకుంది. దింతో మండలి రాజకీయం రంజుగా కనిపిస్తోంది.

విపక్షానిదే పెత్తనం

ఓవైపు ఏపీ అసెంబ్లీలో కార్యకలాపాలన్నీ ఏకపక్షంగా సాగిపోతుంటే పెద్దల సభ అయిన శాసనమండలిలో మాత్రం పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఓ రకంగా చెప్పాలంటే అసెంబ్లీలో వైసీపీ ఆధిపత్యం చెలాయిస్తుంటే మండలిలో విపక్షాలు ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి. అదీ ఎప్పటికప్పుడు విపక్షాలదే పైచేయి అవుతోంది. దీంతో కీలక బిల్లులు నెగ్గించుకునేందుకు విపక్షాలను తప్పనిసరిగా ఒప్పించాల్సిన పరిస్ధితి అధికార పక్షానిది. కానీ ఓవైపు అసెంబ్లీలో టీడీపీని ముప్పతిప్పలు పెడుతూ మండలిలో మద్దతు కోరితే ఇచ్చేందుకు ఆ పార్టీ కూడా సిద్దంగా లేదు. అక్కడ టీడీపీ సభ్యులంతా ఏకమై అధికారపక్షానికి చుక్కలు చూపిస్తున్నారు. మంత్రుల అసహనం, కోపాలు తప్ప మండలి విషయంలో ఏమి చేయలేని నిస్సహాయత జగన్ ది.

ఏపీ శాసనమండలిలో వైసీపీకి మెజారిటీ రావాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌, జూన్‌ తర్వాతే సాధ్యం. అప్పటి వరకూ ప్రస్తుతం ఉన్న 11 మంది ఎమ్మెల్సీలతోనే నెట్టుకు రావాల్సిన పరిస్దితి. కీలక బిల్లులు ఎక్కువగా పెండింగ్‌లో ఉండటం, ప్రతీ దానిపైనా అసెంబ్లీకి భిన్నంగా పూర్తిస్దాయిలో చర్చించి ఆమోదించాల్సిన పరిస్ధితి ఉండటంతో వైసీపీ మంత్రులు తొందరపడేందుకు కూడా అవకాశం దొరకడం లేదు. దీంతో అసెంబ్లీని ఎక్కువ రోజులు నిర్వహించలేక, అటు ఉన్న సమయంలోనే బిల్లులు ఆమోదించుకోలేక వైసీపీ అపసోపాలు పడుతోంది. అంతిమంగా మనకు మెజారిటీ ఎప్పుడొస్తుందో అని వైసీపీ ఎదురుచూడక తప్పని పరిస్ధితి మండలిలో కనిపిస్తోంది.