Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న పెనక శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో మెమో దాఖలు చేశారు. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడానికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది. శరత్ చంద్రారెడ్డి వివిధ సంస్థలు, వ్యక్తులతో కలిసి సిండికేట్ గా ఏర్పాటు చేసుకుని అవినీతి మార్గంలో సొమ్ము సంపాదించేందుకు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారంటూ ఈడీ అభియోగాలు నమోదు చేసింది. అలాగే అక్రమంగా నగదు చలామణి వ్యతిరేక చట్టం కింద కూడా కేసు నమోదు చేసి ఆయనను గత ఏడాది నవంబర్ 11 అరెస్టు చేసింది.

ఈ ఏడాది జనవరి 27న తన నానమ్మ అంత్యక్రియల కోసం బెయిల్ కు అప్పీల్ చేసుకోగా కోర్టు 14 రోజులు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 1న తన భార్య అనారోగ్య కారణాలతో మరో సారి బెయిల్ కోరగా నాలుగు వారాలు బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 25న బెయిల్ పొడిగింపు పిటిషన్ వేయగా, దానిని కోర్టు తిరస్కరించింది. మళ్లీ మే 8న శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరైన మొదటి వ్యక్తి శరత్ చంద్రారెడ్డి కావడం విశేషం.
ఈ కేసులో మరో నిందితుడు గా ఉన్న డిప్యూటి మాజీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ కు అప్పీల్ చేసుకోగా ఇటీవల కోర్టు తిరస్కరించింది. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో బయిల్ పై బయటకి వెళ్లి సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని అందుకే బెయిల్ ను తిరస్కరిస్తున్నట్లు కోర్టు తెలిపింది. కాగా బెయిల్ పై ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడంతో లిక్కర్ స్కామ్ కేసులో ఇంకా ఎంత మంది పేర్లు వెలుగులోకి వస్తాయనే దానిపై సర్వత్రా ఆసక్తినెలకొంది.
వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు కాలుకు కర్ర అడ్డు పడి.. వీడియో వైరల్