నేర రహిత రాష్ట్రమే లక్ష్యం –డీజీపీ

హైదరాబాదు, డిసెంబర్ 30: తెలంగాణాను నేర రహిత రాష్ట్రంగా చేయడమే లక్ష్యమని డీజీపీ మహీందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ వార్షిక నివేదికను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మెచ్చేలా, నచ్చేలా సేవలు అందిస్తున్నామని అన్నారు. వచ్చే మూడేళ్లలో మూడు కమిషనరేట్‌ల పరిధిలో పది లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, అన్ని జిల్లాల్లో భరోసా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు శాతం నేరాలు తగ్గాయని, మహిళలపై జరిగే నేరాలు ఏడు శాతం తగ్గాయనీ చెప్పారు. షీ టీమ్స్‌ ప్రభావంతో మహిళలపై నేరాలు తగ్గుతున్నాయని వివరించారు. నేరం చేస్తే దొరికిపోతామన్న భయాన్ని నేరస్తుల్లో కలిగేలా చేశామన్నారు.