అధికార పార్టీ నేతలతో సన్నిహిత స్నేహ సంబంధాలను కొనసాగించడమే కాక వారితో విదేశీ పర్యటనకు వెళ్లి ఎంజాయ్ చేసిన ఫలితంగా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ కు గురైయ్యారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా బ్యాంకాక్ వెళ్లిన కారణంగా ఇప్పటికే ప్రకాశం జిల్లా దర్శి ఎస్ఐ చంద్రశేఖర్ ను జిల్లా ఎస్పీ మలికా గార్గ్ సస్పెండ్ చేయగా,. తాజాగా దర్శి డిప్యూటి తహశీల్దార్ ఏవి రవిశంర్ ను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సస్పెండ్ చేశారు. అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నందున ఉన్నతాధికారులు ఏమి చేస్తారులే అన్న ధీమా ఏమో కానీ ఈ ఇద్దరు అధికారులు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఈ నెలలో బ్యాంకాక్ టూర్ కు వెళ్లి వచ్చారు.
నిబంధనల ప్రకాశం ప్రభుత్వ అధికారులు ఎవరైనా సెలవు తీసుకుని వ్యక్తిగత విదేశీ పర్యటనలకు వెళ్లాలన్నా ప్రభుత్వ (ఉన్నతాధికారుల) అనుమతి విధిగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ దర్శికి చెందిన ఈ అధికారులు మాత్రం ఆ ప్రాంత అధికార పార్టీ నేతలతో బ్యాంకాక్ వెళ్లి వచ్చారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో సీరియస్ అయ్యారు. ముందుగా దర్శి ఎస్ఐ చంద్రశేఖర్ పై ఎస్పీ శాఖాపరమైన విచారణ జరపగా ఆయన బ్యాంకాక్ వెళ్లినట్లు రజుువు అయ్యింది. దీంతో జిల్లా ఎస్పీ మలికా గార్గ్ పది రోజుల క్రితం ఎస్ఐ చంద్రశేఖర్ ను సస్పెండ్ చేశారు.
ఎస్ ఐ చంద్రశేఖర్ సస్పెండ్ అయిన తర్వాత దర్శి డిప్యూటి తహశీల్దార్ రవిశంకర్ కూడా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఈ నెల 14 నుండి 18 వ తేదీ మధ్య బ్యాంకాక్ టూర్ కు వెళ్లినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ ఇప్పటికే డీప్యూటి తహశీల్దార్ రవిశంకర్ కు షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పాటు పాస్ పోర్టు సరెండర్ చేయాలని ఆదేశించారు. పాస్ పోర్టు పరిశీలించగా అతను బ్యాంకాక్ వెళ్లినట్లు రుజువు అయ్యింది. ఈ విషయాన్ని రవిశంకర్ కూడా ఉన్నతాధికారుల వద్ద ఒప్పుకున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ .. డిప్యూటి తహశీల్దార్ రవిశంకర్ ను విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలతో ఎక్కువ మంది అధికారులు పోస్టింగ్ లు ,ట్రాన్స్ ఫర్స్ ఇతరత్రా పనుల కోసం సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. అయితే కొందరు అధికారులు ఆ సాన్నిహిత్యాన్ని స్నేహంగా కొనసాగిస్తూ ఆ పార్టీ నేతల ఇచ్చే విందు వినోదాల్లో పాల్గొనడం, వారితో టూర్లు,. షికార్డు చేస్తుంటారు. ఇక్కడే ప్రత్యర్ధులకు దొరికిపోతుంటారు. ఆ ఫలితమే ఈ ఇద్దరు అధికారులు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏపీ పోలీస్ శాఖలో సంచలనం..కొంపముంచిన బ్యాంకాక్ టూర్.. ఎస్ఐ సస్పెండ్. !!