అన్న‌దాత‌ల‌కు అండగా నిలుస్తున్న దాబా..! “ఛ‌లో ఢిల్లీ” నిర‌స‌న‌ రైతుల‌కు ఉచితంగా భోజనం అందిస్తూ..

అందిరికీ అన్నం పెడుతూ దేశానికి వెన్నుగా నిలుస్తున్న అన్న‌దాత నేడు ప‌డుతున్న క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతం. ఎన్ని ప్ర‌భుత్వాలు మారినా.. ఎక్క‌డి గొంగ‌డి అక్క‌డే అనే రీతిన రైతుల ప‌రిస్థితిలో మార్పు రాలేదు. రోజురోజుకూ మ‌రింత న‌ష్ట‌పోతూ ఉన్న‌ప్ప‌టికీ.. వ్య‌వ‌సాయాన్నే న‌మ్ముకుని జీన‌వనం కొన‌సాగిస్తున్నాడు. ఇన్ని రోజులు అన్నీ భ‌రిస్తూ వ‌చ్చిన రైత‌న్న‌.. ఇక ఊరుకోనంటూ స‌ర్కారుపై క‌న్నేర్ర జేశాడు. ఛ‌లో ఢిల్లీ అంటూ రాజ‌ధాని వీధుల్లో.. స‌రిహ‌ద్దుల్లో పోరాటానికి సిద్ధ‌మ‌య్యాడు.

ఇన్ని రోజులు అంద‌రికి అన్నం పెట్టిన రైత‌న్న తిండితిప్ప‌లు మాని ఆందోళ‌న బాట ప‌ట్టిన వేళ వారికి నేనున్నానంటూ ఓ దాబా అండ‌గా నిలుస్తోంది. దేశ ప్ర‌జ‌ల ఆక‌లి తీర్చిన వారి ఆక‌లి తీర్చ‌డానికి ముందుకు వ‌చ్చింది. ఉచితంగానే ఆహారం అందిస్తూ.. వారి ఆందోళ‌న‌కు చేయుత‌నందిస్తోంది. వారు ఆ ప్రాంతంలో ఆందోళ‌న‌లు కొన‌సాగించిన‌న్ని రోజులు తిన‌డానికి ఉచితంగానే ఆహారం అందిస్తానంటూ.. ముందుకు వ‌చ్చిన ఆ దాబాపై ప్ర‌స్తుతం ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.

ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన వివాదాస్ప‌ద మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ.. గ‌త నాలుగు రోజులుగా దేశంలో అన్నదాతలు ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా ఛ‌లో ఢిల్లీ పేరిట రాజ‌ధానిలోకి ప్ర‌వేశించిన రైతులు.. లాఠీదెబ్బ‌లు, పోలీసుల దుశ్చ‌ర్య‌ల‌కు ఎదురొడ్డి.. గ‌డ్డ‌క‌ట్టే చ‌లిలోనూ వెనుక‌డుగు వేయ‌కుండా త‌మ నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌తో ముందుకు సాగుతున్నారు. ప్ర‌భుత్వం దిగివ‌చ్చేదాక త‌మ ఆందోళ‌న‌ను కొన‌సాగిస్తామ‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే చాలా మంది రైతులు తిన‌డానికి తిండి, తాగ‌డానికి నీరు లేక అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. వారు ప‌డుతున్న బాధ‌ల‌ను చూసిన ఓ దాబా వారి ఆక‌లిని తీర్చుతోంది. అదే ఢిల్లీ శివారులోని మ‌ర్తాల్‌లో ఉన్న “ఆమ్రిక్ సుఖ్‌దేవ్ దాబా”. ఈ దాబా యజమాని ఆందోళ‌న చేస్తున్న రైతుల‌కు ఉచితంగా భోజ‌నం అందిస్తున్నారు. దాబా య‌జ‌మాని మాట్లాడుతూ… రైతుల కంటే గొప్ప‌వాళ్లు ఏవ‌రుంటారు.. వారికి అన్నం పెట్ట‌డం చాలా సంతోషంగా ఉంది అంటూ త‌న ఉదారగుణాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో.. ఆ దాబా య‌జ‌మానిపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.