ఈయన రాజ్యాంగబద్ధ గవర్నరా..అవ్వ!

మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి ట్వీట్‌ను సమర్థించి వివాదంలో చిక్కుకున్నారు.
కాశ్మీర్‌పై ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమయ్యింది.

రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ ఈ విధంగా ట్వీట్‌ చేయడంపై నెటిజన్లతో పాటు కాశ్మీరీలు మండిపడుతున్నారు.
అర్మీ అధికారి తన ట్వీట్‌లో ‘రెండేళ్ల పాటు భారతీయులు ఎవరూ కాశ్మీరు వెళ్లొద్దు. అమర్‌నాధ్ వెళ్లొద్దు. కాశ్మీర్ ఎంపోరియం నుండి కాశ్మీరీ వర్తకుల నుండి వస్తువులు కొనుగోలు చేయొద్దు’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌ను గవర్నర్ తథాగత రాయ్ సమర్థిస్తూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇది వివాదానికి కారణమయ్యింది.
బాధ్యతాయుతమైన గవర్నర్ పదవిలో ఉండి ఇలాంటి ట్వీట్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దేశ పౌరుల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టడం ఏమిటనని నిలదీస్తున్నారు.


తథాగత రాయ్ చర్యలపై కాశ్మీరు మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముప్తీ మండిపడ్డారు. ఆయన్ను గవర్నర్ పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.
మరో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. తథాగత రాయ్ వంటి వ్యక్తులు కాశ్మీరీలు లేని కాశ్మీరు కావాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు.