దేవరగట్టులో ఆంక్షలు బేఖాతరు..! కొనసాగిన బన్నీ ఉత్సవం..! 50మందికిపైగా గాయాలు..!!

 

(కర్నూలు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది దేవరగట్టులో బన్ని ఉత్సవాన్ని (కర్రల సమరం) రద్దు చేసినట్లు అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రామాన్ని మొత్తం పోలీసులు ఆధీనంలో తీసుకుని పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినా భక్తుల పంతమే నెగ్గింది. ప్రతి ఏటా మాదిరిగానే మాలమల్లేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా బన్నీ ఉత్సవం (కర్రల సమరం)లో వేలాది మంది యువకులు, పెద్దలు ఊత్సాహంగా భక్తి పారవశ్యంతో పాల్గొన్నారు. సోమవారం రాత్రి 10.30 గంటల వరకూ పోలీసుల పహారా మధ్య దేవరగట్టు నిర్మాణుష్యంగా ఉండగా ఆ తరువాత నెరణి, నెరణితండా, సుళువాయి గ్రామాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో తేరు బజారు ప్రాంతం జనసంద్రమైంది.

ఇక్కడ మాల మల్లేశ్వరస్వామి వారి ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు రెండు వర్గాలుగా విడిపోయి రింగ్‌లు తొడిగిన కర్రలతో సమరం సాగించారు. అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. పరిస్థితిని అదుపు చేయలేక పోలీసులు చేతులు ఎత్తేశారు. అర్థరాత్రి దాటే వరకూ దివిటీల వెలుగులో కర్రల సమరం కొనసాగింది. ఈ బన్నీ ఉత్సవంలో దాదాపు 50మందికి పైగా యువకులకు గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఆలయం వద్ద తాత్కాలిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోవడంతో గాయపడిన వారిని ఆదోనీ, ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. దాదాపు లక్ష మంది భక్తులు దేవరగట్టు ఉత్సవంలో పాల్గొనగా అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.