యాభై అడుగుల లోతులో బోటు!

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట బోటు వెలికితీత పనుల్లో ధర్మాడి సత్యం బృందం పురోగతి సాధిస్తోంది. నిన్న బోటు రెయిలింగ్‌ను బయటకు తీసిన ఆ బృందం… తమ ప్రయత్నాలను శుక్రవారం కూడా కొనసాగిస్తోంది. ప్రస్తుతం బోటు 50 ఆడుగుల లోతులో ఉన్నట్లు ధర్మాడి సత్యం వెల్లడించారు. ఇవాళ విశాఖపట్నం నుంచి కొందరు డైవర్లు వస్తారని, బోటు బయటకు తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్ ఆది నారాయణ ఆధ్వర్యంలో బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి.

సెప్టెంబర్ 15న పర్యాటకులతో బయలుదేరిన రాయల్ వశిష్ట బోటు కచ్చులూరు వద్ద మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 38 మృతదేహాలు లభ్యం కాగా మరో 13 మంది ఆచూకీ గల్లంతైంది. అయితే, గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం కాకపోవడంతో బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

మరోవైపు కచ్చులూరు మందంలో గతంలో మునిగిన ఏ బోటుగాని, లాంచ్‌ గాని ఇప్పటివరకు బయటపడిన దాఖలాలు లేవని స్థానిక గ్రామస్తులు బాహాటంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో , బోటును వెలికి తీస్తారో లేదో వేచి చూడాలి.