రూ.500 కోట్ల‌తో కూతురు పెళ్లి చేశాడు.. చివరికి?

కాలం క‌లిసొస్తే.. న‌డిసొచ్చే కొడుకు పుడుతాడు అనే సామెత మీకు గ‌ర్తు ఉండే ఉంటుంది. అవును నిజ‌మే అదృష్టం క‌లిసొస్తే.. ఎంత‌టి క్లిష్టం పిరిస్థితులు, స‌మ‌స్య‌లు ఎదురైన పెద్ద‌గా పోరాడ‌కున్న ఇబ్బందులన్నీ గ‌ట్టెక్కిపోతాయి. ఇదే మాదిరిగా ఒక్కో సారి కాలం క‌లిసి రాక‌పోతే ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన క‌టిక చిక‌టిలోనే మిగిలిపోతుంటారు. కాలం క‌లిసి రాన‌ప్పుడు ఓడ‌లు సైతం బండ్ల‌వుతాయి అని మ‌న పెద్ద‌లు అప్పుడ‌ప్పుడు అంటుండ‌టం సాధార‌ణ‌మే.. అయితే, తాజాగా ఇలాంటి ఘ‌ట‌నలు వెలుగులోకి రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు !

ఎందుకంటే కూతురి పెండ్లి కోసం ఏకంగా రూ.500 కోట్లు ఖర్చు చేసిన ఓ కోటీశ్వ‌రుడు… ప్ర‌స్తుతం తీసుకున్న అప్పు కూడా చెల్లించ‌లేని స్థితికి దిగ‌జారి బికారిగా మారాడు. అవును మీరు చ‌దివిందే నిజ‌మే.. అప్పుడు కోట్లున్నాయి కానీ ఇప్పుడు అది చరిత్రే ! ఈ మాదిరిగా దివాలా తీసి వార్తాల్లో నిలిచిన వ్య‌క్తుల్లో రిలియ‌న్స్ అధినేత అనిల్ అంబానీ, ఇది వ‌ర‌కూ “కౌన్ బ‌నేగా కరోడ్ పతి” విజేత‌లు ఉన్నారు.

తాజాగా ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుల్లో ఒక‌రైన ల‌క్ష్మీ మిట్ట‌ల్ త‌మ్ముడు ప్ర‌మోద్ మిట్ట‌ల్ సైతం పైన చెప్పిన వారి జాబితాలో చేరిన‌ట్టు స‌మాచారం. దాదాపు 24 వేల కోట్ల అప్పులు ఉన్న‌ట్టు ప‌లు నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ఇంత భారీ మొత్తంలో అప్పులు ఉన్న మ‌రో వ్య‌క్తి బ్రిట‌న్‌లో లేర‌ని ఆ నివేదిక‌లు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న అప్పులు తీర్చే స్థితిలో లేరినీ, దివాలా తీయ‌డం ఖాయ‌మ‌ని తెలుపుతున్నాయి. అయితే, 2004లో ఆయ‌న త‌న కూతురు వ‌నిశా పెళ్లికి ఏకంగా రూ. 500 కోట్లు ఖర్చు చేశారు. అలాగే, 2013లో మ‌రో కూతురు శ్రిష్టి పెళ్లికి సైతం భారీ ఖ‌ర్చుతో నిర్వ‌హించి వార్త‌ల్లో నిలిచారు.

అయితే, ప్రమోద్ మిట్టల్ బ్యాడ్ టైమ్ 2006లోనే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఈయన బోస్నియన్ కోక్ తయారీ కంపెనీ జీఐకేఐఎల్‌ రుణాలకు తన గ్లోబల్ స్టీల్ హోల్డింగ్స్ తరుపున ఈయన గ్యారంటీ సంతకం చేశారు. అయితే జీఐకేఐఎల్ కంపెనీ మోర్గేట్ ఇండస్ట్రీస్‌కు చెల్లించాల్సిన రుణాన్ని కట్టడంలో విఫలమైంది. దీంతో మోర్గేట్ కంపెనీ 166 మిలియన్ డాలర్ల కోసం ప్రమోద్‌ను కోర్టుకు లాగింది. అయితే ప్రమోద్ ఈ డబ్బులు చెల్లించలేకపోయారు. దీనికి తోడు ఆయ‌న తన తండ్రికి 170 మిలియన్ పౌండ్లు, కొడుకు దివేశ్‌కు 2.4 మిలియన్ పౌండ్లు, భార్య సంగీతకు 1.1 మిలియన్ పౌండ్లు, బావ అమిత్ లోహియాకు 1.1 మిలియన్ పౌండ్లు అప్పు ఉన్నారు. దీంతో ఆయ‌న దివాలా తీసిన‌ట్టేన‌ని ప‌లు నివేదిక‌లు వెల్ల‌డించ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.