ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ప్రభుత్వం గెలిచిందా? : అసలు జరిగిందేమిటి అంటే

 

టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలీసుశాఖ తరపున అన్నీ తానై నడిపించిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేస్వరరావు కేసులో ప్రభుత్వానికి  సానుకూలమైన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన, ఈ కేసులో అసలు కథ ఇప్పటినుంచే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసే అధికారం ఉందని కోణంలో సుప్రీం హైకోర్టు స్టే నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసు రాజకీయ కోణం పెరగడంతోపాటు టిడిపి వైఎస్ఆర్సిపి కార్యకర్తల మధ్య కొత్త చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. హైకోర్టు మొత్తం టిడిపి కి అనుకూలంగా మారిందని ప్రతి కేసు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు చెబుతుంటే, జగన్ మోడీ దగ్గరకు వెళ్లి వచ్చిన దగ్గర నుంచి వై ఎస్ ఆర్ సి పికు న్యాయపరమైన భరోసా దొరికిందని టిడిపి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే అసలు ఈ కీలక కేసు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం చేసిన తప్పు ఏమిటి అనేది ఒకసారి గమనిస్తే….!!!

పద్ధతి ప్రకారం వెళితే బాగుండేది!

టిడిపి ప్రభుత్వ హయాంలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తన పరిధిని దాటి వ్యవహరించారని పోలీసుశాఖ పెద్దలే చెప్పే మాట. ఎన్నికల సమయంలోనూ వైఎస్ఆర్సిపి కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెట్టే పలు అంశాలను ఆయన చేపట్టారు. డిజిపి పోస్టులో ఎవరు ఉన్నా, ఏబీ వెంకటేశ్వరరావు మాటే తుది అయ్యేది. చంద్రబాబు సైతం ఏ బి చేతుల్లో కె మొత్తం పోలీసు వ్యవస్థను పెట్టేసారు అనేది బహిరంగ రహస్యం. ప్రభుత్వం మారినా వెంటనే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ముఖ్యమైనది ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడం… ఎలాంటి అనుమతులు లేకుండా ఫోన్ ట్యాపింగ్ యంత్రాలను కొనుగోలు చేసి ఆయన కొడుకు పేరు వినియోగించారని, దీనిలో సైతం అవినీతి జరిగిందని అందులోనూ దేశ భద్రతా వ్యవహారానికి సంబంధించిన ఈ అంశంపై జగన్ ప్రభుత్వం దృష్టి నిలిపి ఏబీ వెంకటేశ్వరరావును వెంటనే సస్పెండ్ చేసింది. అయితే జగన్ ప్రభుత్వం దూకుడు మీద వ్యవహరించింది తప్ప నిబంధనలు పద్ధతి పాటించకుండా వెళ్లడం తోనే ఏబీ కు కలిసి వచ్చింది.
* ఐపీఎస్ అధికారి సస్పెండ్ చేయాలి అంటే దానికి ముందు కొన్ని నిబంధనలు కచ్చితంగా ఉంటాయి.
* ఓ వ్యవహారం మీద అఖిల భారత సర్వీసులు అధికారిని సస్పెండ్ చేసే ముందు ఆ వ్యవహారంలో ప్రాథమిక సాక్ష్యాధారాలు, విచారణ ఉండాలి. ప్రాథమిక విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి మీద తప్పు చేసినట్లు తగిన ఆధారాలు లభించాలి. అప్పుడే ఆ అధికారికి మొదట ఛార్జ్ మెమో జారీ చేసి వివరణ కోరిన అనంతరం మాత్రమే ఆ వివరణతో సంతృప్తి చెందకపోతే ప్రభుత్వం సస్పెండ్ చేయాలి.
* ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలో ప్రభుత్వం చివరగా చేయాల్సిన సస్పెన్షన్ ను ముందుగా చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు ని అరెస్టు చేస్తారంటూ ఏసీబీ కూడా కొన్ని లీకులు ఇచ్చింది. దీన్నే అదునుగా తీసుకుని ఏబీ హైకోర్టును ఆశ్రయించారు.
*ఈ వ్యవస్థను కాపాడడం వరకూ ఓకే గాని వ్యక్తి కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. అందులోనూ అఖిల భారత సర్వీసు అధికారికి ప్రత్యేకమైన పరిమితులు ఉంటాయి. దీన్ని ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ముందు ఉంచారు. ప్రభుత్వం కక్షపూరితంగా తనను వ్యవహరించిందని సస్పెన్షన్ ముందే చేసిందని, ప్రభుత్వం వల్ల తనకు వ్యక్తిగత సిబ్బంది భద్రత కరువయ్యాయని కోర్టుకు విన్నవించారు. దీంతోనే కోర్టు ఆయన సస్పెన్షన్ పై స్టే ఇవ్వడానికి అంగీకరించింది. దీనిలో న్యాయ వ్యవస్థ తప్పేమీ లేదు ప్రభుత్వం వ్యవహరించిన తీరు లోనే అపరిపక్వత కనిపిస్తోంది.

మరి సుప్రీం ఇచ్చిన తీర్పు?

హైకోర్టు ఇచ్చిన సస్పెన్షన్ స్టే ఉత్తర్వులపై సుప్రీంకోర్టు చేయడం పట్ల న్యాయనిపుణులు ఆశ్చర్యం ఏమీ వ్యక్తం చేయడం లేదు.
* హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసిన ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టులో మొత్తం వ్యవహారంపై అఫడవిట్ దాఖలు చేసారు. కేసు మొత్తం విచారణ చేస్తామని, దీనిలో లభించిన కొన్ని ప్రాథమిక విషయాలను కోర్టుకు సవివరంగా తెలియ పరిచారు. దీంతోనే రాష్ట్ర ప్రభుత్వానికి అఖిల భారత సర్వీసు అధికారులు సస్పెండ్ చేసే అధికారం ఉన్నందున సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తరపున దాఖలు చేసిన అఫిడవిట్లో పరిశీలించి హైకోర్టు సేపై తగిన ఉత్తర్వులను జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ వెంకటేశ్వరరావు పై వచ్చిన ఆరోపణలపై మళ్లీ మొదటి చేయాల్సిన పనిని తీరికగా ఇప్పుడు మొదలు పెట్టే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కాస్త తెలివిగా ఆలోచించి ఏబీ వెంకటేశ్వరరావు పై విచారణ ముందుగానే వేసి, దానిలో ప్రాథమిక ఆధారాల ఆధారంగా ఆయనను సస్పెండ్ చేసి ఉంటే కేసు ఎంత కష్టం అయ్యేది కాదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే కేసులో హైకోర్టు తప్పు ఏమీ లేదు సుప్రీంకోర్టు తప్పు అంతకన్నా ఏమీ లేదు. కేవలం న్యాయ వ్యవస్థ లోని కొన్ని అంశాలను ఆధారంగా చేసుకొని తగిన విధంగా వ్యవహరిస్తే, ఎవరికైనా తగిన న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం సైతం నిబంధనలు పాటించే విధంగా ముందుగానే విచారణ చేసి సస్పెండ్ చేస్తే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. ఈ కేసులో ఎవరిది గెలుపు కాదు ఓటమి కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.