వ్యక్తిగత పరిశుభ్రత లో భాగం గా చెవులలో గులిమి తొలగించడానికి చాలా మంది కాటన్ బడ్స్‌ను వాడుతున్నారు. కొందరు పేపర్‌ను చుట్టలా చుట్టి, ఇంకొందరు బట్టను పెట్టి లేదా పిన్నీసులు పెట్టి దాన్ని తీస్తుంటారు. అలాచేయడం చాల ప్రమాదమని స్పెషలిస్టులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కాటన్ బడ్స్‌తో చాల జాగ్రత్త గా ఉండాలట.
ఎందుకంటే వాటి వల్ల వినికిడి లోపం వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేవలం వైద్యులే కాదు.. కాటన్ బడ్స్ తయారు చేసే కంపెనీలు కూడా వాటిపై ‘కాటన్ బడ్స్ ప్రమాదకరం’ అని రాస్తారు.. చెవుల్లో వుండే వ్యర్థాన్ని తొలగించు కునే నిర్మాణం స్వతహాగా చెవులే కలిగి ఉన్నాయట. కాబట్టి మనం ప్రత్యేకంగా వ్యర్థాన్ని తొలగించుకోవాల్సిన అవసరం లేదని తాజా అధ్యయనంలో బయటపడింది. చెవులువాటంతట అవే శుభ్రం చేసుకుంటాయని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులుకూడా వెల్లడించారు.
అలా కాకుండా ఇయర్ బడ్స్ ద్వారా శుభ్రం చేయాలని ప్రయత్నిస్తే లోపల వుండే గులిమి కొంత మాత్రమే బయటికి వస్తుందట. మిగిలినది ఇయర్ బడ్స్ తాకడంవలన మరింత లోపలికి వెళ్లి ఇయర్ కెనాల్ నుంచి ప్రయాణించే కర్ణభేరి పై పడుతుందని పరిశోధకులు తెలియచేస్తున్నారు. చెవి లోపలికి ప్రవేశించే ధ్వని తరంగాలకు అనుగుణంగా ప్రకంపనాలు సృష్టించి.. వాటిని మెదడుకు చేరవేయడం కర్ణభేరి పని.
అయితే అలా ఎక్కువ శాతం గులిమి కర్ణభేరి పై పేరుకు పోతే.. సున్నితమైన కర్ణభేరి తరంగాలకు అనుగుణంగా ప్రకంపనాలు సృష్టించే సామర్థ్యం కోల్పోతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కంపిస్తున్న వస్తువు పై భారం పడితే.. అది కంపనాలను ఆగిపోయేలా చేస్తుందని వారు సూచిస్తున్నారు. ఇలా కర్ణభేరి పనికి ఆటంకం కలగడం వలన చెవుడు వస్తుందట. అందుకే చెవులుశుభ్రం చేయడానికి బయట నుంచి ఎలాంటి వస్తువులు వాడనవసరం లేదని పరిశోధకులు వివరిస్తున్నారు.కాబట్టి చెవులమీద ఎలాంటి ప్రయోగాలు చేయకపోవడం మంచిది.