తిరుపతిలో పోటీ చేయాలన్న పవన్ కల్యాణ్ కోరిక తీరేనా?బిజెపి ఆ సీటును త్యాగం చేసేనా?

గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపికి మద్దతుగా బరి నుండి వైదొలిగిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తానని జనసేన ప్రకటించటం తదుపరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పవన్ కల్యాణ్ తో చర్చించి జనసేనను ఎన్నికల బరి నుండి ఉపసంహరింప చేయటం తెలిసిందే.టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూసేందుకే జనసేన పోటీ నుండి తప్పుకుందని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పొల్లు పోకుండా బిజెపికి వేయాల్సిందిగా జనసైనికులకు పిలుపు కూడా ఇచ్చారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ పై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.

అయితే అదే సమయంలో జనసేనాని ఒక మెరుపులాంటి ఆలోచనకు పదును పెట్టుకున్నారని జనసేన వర్గాల్లో వినిపిస్తోంది.గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకున్నదానికి ప్రతిఫలంగా త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే తిరుపతి లోక్సభ ఉపఎన్నిక సీటు ను పొత్తులో భాగంగా జనసేనకి ఇవ్వాల్సిందిగా పవన్కల్యాణ్ బీజేపీ హైకమాండ్ ను గట్టిగా కోరనున్నట్లు సమాచారం.ఈ విషయం చర్చించేందుకే పవన్ ఢిల్లీ వెళ్లారని చెబుతున్నారు.మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన దారుణంగా ఓడిపోయింది.పవన్ కల్యాణ్ సైతం రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి పరాజయం చెందారు.ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న జనసేన ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీతో చెలిమి చేసింది.ప్రస్తుతం ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా సాగుతున్నాయి.ఈ తరుణంలో తిరుపతి లోక్సభ ఉపఎన్నిక రావడంతో ఇక్కడ తన స్టామినా చూపాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.తిరుపతి ప్రాంతంలో పవన్ కల్యాణ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మొన్నటి లోక్సభ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తిరుపతిలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థికి జనసేన మద్దతు ఇవ్వగా ఆయనకు దాదాపు ముప్పై వేల ఓట్లు వచ్చాయి.బిజెపి విడిగా పోటీ చేయగా ఆ పార్టీ కూడా ఇరవై వేల ఓట్లు వచ్చాయి.అయితే ఇప్పుడు విడివిడిగా కాకుండా బీజేపీ మద్దతుతో జనసేన పోటీ చేస్తే మంచి ఫలితం రావచ్చునన్నది జనసేనాని అంచనా అంటున్నారు.పైగా ఏ ఎన్నికలు వచ్చినా జనసేన తప్పించుకు తిరుగుతు౦దన్న అపప్రథను కూడా పోగొట్టుకోవటానికి వీలవుతుంది అన్నది మరో లెక్క.

ఇవన్నీ మనసులో పెట్టుకున్న జనసేనాని ఢిల్లీ వెళ్లి బిజెపి అధ్యక్షుడు నడ్డాను కలవడంతో పాటు తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక మీద స్పష్టమైన హామీ తీసుకొని రాబోతున్నారని జనసేన వర్గాలు చెప్తుండగా మరోవైపు బిజెపి తిరుపతి పై పట్టు బిగించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేసింది.మంగళవారం నాడు తిరుపతి నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల బిజెపి నేతలతో సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించింది.తిరుపతిలో పోటీ చేయాలన్న పవన్ కల్యాణ్ కోరిక తీరేనా లేదా అన్నదానిపై ఒకటిరెండు రోజుల్లో క్లారిటీ వస్తుందంటున్నారు