మోదీకి భయపడతారా?: పాక్‌కి మసూద్ అజార్ హెచ్చరిక


శ్రీనగర్: పుల్వామా ఘటన నేపథ్యంలో భారత్ ఒత్తిళ్లకు తలొగ్గి తనపై చర్యలకు పూనుకోవద్దంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్. పాకిస్థాన్ ప్రభుత్వంతోపాటు ఆ దేశ మీడియాను కూడా హెచ్చరిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

‘భారత ప్రధాని నరేంద్ర మోదీ బెదిరింపులకు ప్రతిగా పాక్ ప్రధాని స్పందన చాలా పేలవంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే భారత్‌కు పాక్ భయపడుతున్నట్లు అర్థమవుతోంది’ అని మసూద్ అజార్ ఆ సందేశంలో పేర్కొన్నాడు. మోదీకి భయపడుతోందంటూ పాకిస్థాన్ మీడియాపైనా అజార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అంతేగాక, పుల్వామా దాడి అంశం రాబోయే ఎన్నికల్లో మోదీకి లాభించనున్నట్లు వస్తున్న విశ్లేషణలను కూడా మసూద్ ఖండించాడు. కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చర్యలు ఫలిస్తున్నాయన్న మోదీ వాదన.. ఈ దాడితో తేలిపోయిందని అజార్ వ్యాఖ్యానించాడు.

కాగా, దాడికి కారణమైన వారిని భారత భద్రతాబలగాలు కేవలం 100గంటల్లోపు మట్టుబెట్టడంతో జైషే ఉగ్రవాదుల్లో అభద్రత నెలకొందని.. అందుకే మసూద్ ఈ రకంగా మాట్లాడుతున్నట్లు కాశ్మీర్‌కు చెందిన ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) సమావేశంలో లష్కరే తొయిబాకు చెందిన ఫతా-ఇ-ఇన్సానియత్, జమాత్-ఉద్-దవా నిషేధానికి సంబంధించిన అంశం చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో తనపై కూడా ఎక్కడ చర్యలు తీసుకుంటారోనని మసూద్ భయాందోళనలకు గురవుతున్నట్లు తెలుస్తోంది.

‘పుల్వామా చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 15-20మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు, 20-25మంది జైషే ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం ఉంది. వారిలో ముఖ్యమైన వారిని త్వరలోనే పట్టుకుంటాం. పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరుగుతుండటంతో మసూద్ భయపడుతున్నట్లు అర్థమవుతోంది. అందుకే పాక్ ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాడు’ అని ఓ ఉన్నతాధికారి తెలిపారు.