కోవిడ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న పేషెంట్ల చికిత్సకు గాను ప్రస్తుతం ఫావిపిరవిర్ అనే మెడిసిన్‌ను పలు ఫార్మా కంపెనీలు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే మెడిసిన్‌ను ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్.. Avigan (అవిగాన్) పేరిట అందుబాటులోకి తెచ్చింది. 200 మిల్లీగ్రాముల మోతాదులో ఈ మెడిసిన్ లభిస్తోంది. ఈ మెడిసిన్‌ను పేషెంట్లకు ఇంటి వద్దకే డెలివరీ అందిస్తామని డాక్టర్ రెడ్డీస్ తెలియజేసింది. అందుకు గాను హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశామని, సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆ నంబర్లు పనిచేస్తాయని, వాటికి కాల్ చేస్తే ఈ మెడిసిన్‌ను పేషెంట్ల ఇండ్లకే డెలివరీ చేస్తామని.. డాక్టర్ రెడ్డీస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
అవిగాన్ మెడిసిన్‌ను థెరపీ ప్యాక్ పేరిట 122 ట్యాబ్లెట్ల బండిల్‌తో అందిస్తారు. ఆ ట్యాబ్లెట్లను ఒకేసారి కొని పేషెంట్లు తమ చికిత్సకు వేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 42 సిటీల్లో ఈ మెడిసిన్‌ను హోం డెలివరీ అందిస్తున్నారు. అవిగాన్కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి కూడా లభించింది. అందువల్లే డాక్టర్ రెడ్డీస్ ఈ మెడిసిన్‌ను ప్రస్తుతం ఉత్పత్తి చేస్తోంది.
ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ బ్రాండెడ్ మార్కెట్స్ సీఈవో ఎంవీ రమణ మాట్లాడుతూ.. ఫ్యుజిఫిలిం టొయామా కెమికల్ కొ.. లిమిటెడ్‌తో ఈ మెడిసిన్ తయారీకి ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. దీనికి డీసీజీఐ అనుమతి కూడా ఉందన్నారు. ఈ మెడిసిన్ కావల్సిన వారికి హోం డెలివరీ చేస్తామని తెలిపారు. త్వరలోనే రెమ్‌డెసివిర్‌కు కూడా మెడిసిన్‌ను తయారు చేసి విడుదల చేస్తామని తెలిపారు.