నేటి యువత డ్రగ్స్ కు బాగా అలవాటు పడిపోయింది. డ్రగ్స్ దందాలు చేసేవాళ్లు కూడా ఎక్కువగా యువతలను, సెలబ్రిటీలను టార్గెట్ చేసుకొని తమ దందాను నడుపుకుంటున్నారు. ఎన్ని డ్రగ్స్ రాకెట్లను పోలీసులు ఛేదించినా ఎక్కడో ఒక చోట రహస్యంగా డ్రగ్స్ దందా జరుగుతూనే ఉన్నది.
తాజాగా డ్రగ్స్ కు సంబంధించిన సెన్షేషనల్ న్యూస్ ఏంటంటే.. హైదరాబాద్ అడ్డాగా 100 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను తయారు చేసింది డ్రగ్స్ మాఫియా. ఆ డ్రగ్స్ ను దేశ వ్యాప్తంగా అమ్మడమే కాదు.. విదేశాలకు కూడా తరలిస్తారట.
ముఖ్యంగా వీళ్ల టార్గెట్ యువత, కాలేజీ విద్యార్థులు. దేశంలోని అన్ని మెట్రో సిటీల్లో కాలేజీ విద్యార్థును టార్గెట్ చేసుకొని వాళ్లకు డ్రగ్స్ ప్యాకెట్లను విక్రయిస్తుంటారు. అయితే.. డ్రగ్స్ ఎవరికి పడితే వాళ్లకు అమ్మరు. దానికో పెద్ద నెట్ వర్క్ ఉంటుంది.
డ్రగ్స్ కొనాలంటే సీక్రెట్ కోడ్ తెలిసి ఉండాలి. ఈ డ్రగ్ మాఫియా మాత్రం మియావ్ మియావ్, బాత్ సాల్ట్ లాంటి సీక్రెట్ కోడ్స్ తో డ్రగ్స్ ప్యాకెట్లను అమ్ముతారట.
హైదరాబాద్ లో తయారైన ఈ డ్రగ్ పేరు మెపిడ్రోన్. ఇది కూడా డ్రగ్గే. సాధారణంగా ఉంటే కొకైన్, అంపెటమైన్ లాంటి డ్రగ్స్ లాగానే ఇది కూడా మత్తును ఇస్తుంది.
ఇక ఈ భారీ డ్రగ్ రాకెట్ ను డీఆర్ఐ అధికారులు ఛేదించారు. హైదరాబాద్ తో పాటుగా ముంబైలో ఈ డ్రగ్ రాకెట్ తో సంబంధం ఉన్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఒకేసారి రెండు చోట్ల దాడులు నిర్వహించి భారీ స్థాయిలో డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు.
ముంబైలో మెపిడ్రోన్ తో పాటుగా కెటమైన్ డ్రగ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రైడ్ కు వస్తున్నారని ముందే తెలుసుకున్న డ్రగ్స్ ముఠా డ్రగ్ ను హైదరాబాద్ నుంచి ముంబైకి తరలించింది. దీంతో అక్కడ కూడా ఒకేసారి దాడులు నిర్వహించి డ్రగ్ మొత్తాన్ని పట్టుకున్నారు.
కెటమైన్ డ్రగ్ ను కే గా చెబుతారు. కే అంటే కిట్ కాట్ అని అర్థం. అది దాని కోడ్ భాష. కెటమైన్ డ్రగ్ ను ఎక్కువగా రేవ్ పార్టీల్లో ఉపయోగిస్తారట. అందుకే దీన్ని పార్టీ డ్రగ్, రేవ్ డ్రగ్ అని కూడా పిలుస్తారు.