థియేటర్లు కొన్ని నెలలపాటు మూతపడిపోతాయని.. థియేటర్లలో సినిమాలు చూడాలంటే నెలలకు నెలలు వెయిట్ చేయాలని ఎప్పుడైనా అనుకున్నామా? కనీసం థియేటర్ దిక్కు కూడా చూసేవాళ్లు కరువయ్యారు. సినిమాల రిలీజులు లేవు.. ఆడియో వేడుకలు లేవు.. సక్సెస్ మీట్స్ లేవు.. అంతా గందరగోళంగా ఉంది. ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీకే పెద్ద దెబ్బ పడింది. ప్రేక్షకులు కూడా ఐదారు నెలల నుంచి థియేటర్లలో సినిమాలు చూడలేక… ఎంటర్ టైన్ మెంట్ ను మిస్ అవుతున్నారు.
టీవీలు ఉన్నా… డిజిటల్ ప్లాట్ ఫాంలు ఉన్నా… యూట్యూబ్ ఉన్నా.. ఓటీటీలు వచ్చినా.. ఏవీ థియేటర్ల కింద పనిచేయవు. థియేటర్లలో సినిమా చూస్తేనే సినిమా చూసినట్టు. ఆ ఫీలింగే వేరు.
కానీ.. ఈ పరిస్థితుల్లో సినిమా హాళ్లు ఓపెన్ చేయడం కొంచెం కష్టమే. ఒకవేళ సినిమా హాళ్లు తెరుచుకున్నా... థియేటర్లలోకి వెళ్లి సినిమా చూడటానికి సగటు ప్రేక్షకుడు ధైర్యం చేస్తాడా? అనేది పెద్ద డౌటు.
ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సినీ ప్రియులను ఆకట్టుకునేది డ్రైవ్ ఇన్ థియేటర్లే. వాటినే డ్రైవ్ ఇన్ సినిమా అని కూడా అంటారు. ఇప్పుడు ఇవే ఇక మనకు ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వనున్నాయి. డ్రైవ్ ఇన్ థియేటర్లను ఇటీవలే ఢిల్లీలో ప్రారంభించారు.
డ్రైవ్ ఇన్ సినిమా అంటే తెలుసు కదా.. పైన మీరు ఫోటోలో చూస్తున్నట్టుగా ఎవరి కార్లలో వాళ్లే కూర్చొని సినిమా చూడటం అన్నమాట. దాన్ని ఓపెన్ థియేటర్ అని కూడా అనొచ్చు. కరోనా నేపథ్యంలో ఎవరి కారులో వారు కూర్చుంటే వచ్చే ఇబ్బంది లేదు కాబట్టి.. దీనికి డిమాండ్ పెరిగిందట.
ప్రస్తుతం మన దేశంలో ఆరు డ్రైవ్ ఇన్ థియేటర్స్ ఉన్నాయి. వాటిలో రెండు ఢిల్లీ దగ్గర్లోని గురుగ్రామ్ లో ఉన్నాయి. అక్కడే లాక్ డౌన్ తర్వాత మొదటి సారి షో వేశారు. డిమాండ్ ను బట్టి షోలు వేస్తూనే ఉన్నారు.
అయితే… కొత్తగా వచ్చిన మాల్స్, మల్టిప్లెక్సుల కారణంగా కొన్ని డ్రైవ్ ఇన్ థియేటర్లు మూతపడ్డాయి. వాటికి అప్పుడు గిరాకీ లేదు. కానీ.. ఇప్పుడు మళ్లీ డ్రైవ్ ఇన్ థియేటర్లకు గిరాకీ పెరిగింది. దీంతో వాటి దుమ్ము దులిపి.. కొత్తగా తయారు చేసి.. ప్రేక్షకుల కోసం సినిమాలు ప్రదర్శించడానికి రెడీ అయిపోతున్నారు.