టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం…! కుప్పకూలిన భవనాలు..!!

 

టర్కీ, గ్రీక్ దేశాలు రెండు భూకంప ముప్పు ఉన్న ప్రాంతాలు. ఈ దేశాల్లో తరచు భూకంపాలు వస్తుంటాయి. తాజాగా నేటి సాయంత్రం టర్కీలోని ఏజియన్ తీర ప్రాంతాన్ని భారీ భూకంపం కుదిపేసింది. ఏజియన్ సముద్రంలో 16.5 కిలో మీటర్ల లోతులో రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతగా నమోదయ్యాయని ఆమెరికా జియాలాజికల్ సర్వే తెలుపగా 6.6 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు టర్కీ అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇజ్మిర్ నగరంలో ఇప్పటి వరకూ ఆరుగురు మృతి చెందగా 200 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. పదుల సంఖ్యలో పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలిపోవడంతో భారీ ఆస్తినష్టం సంభవించింది.

భూకంపం కారణంగా సముద్ర మట్టం పెరిగి నగరంలోకి వరద వచ్చింది. చేపలుపట్టేవారు కొందరు వరదలో గల్లంతు అయినట్లు సమాచారం. భూకంపం కారణంగా చిన్నపాటి సునామీ రావడంతో గ్రీక్ లో సామోస్ దీవిలోకి నీరు పొటెత్తింది. గ్రీస్‌కి చెందిన మరో దీవి క్రెట్‌లోనూ భూకంప ప్రభావం కనిపించింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లోనూ భూప్రకంపనలు సంభవించాయి. అయితే ఎలాంటి ఆస్తినష్టం సంభవించలేదు.