కేరళ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న వ్యాన్ కుములి మౌంటెన్ రోడ్డులో ఇరైచల్ పాలెం సమీపంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. రోడ్డు పక్కనే ఉన్న 40 అడుగుల గోతులో పడిపోయింది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఏనిమిదేళ్ల బాలుడితో పాటు మరోకరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేరళ – తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో ఈ ప్రమాదం జరిగింది. మృతులు అందరూ తమిళనాడు రాష్ట్రం థేని, అండిపెట్టికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణం అతివేగమేనని పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు.

వ్యాన్ అదుపుతప్పి 40 అడుగుల గోతిలో పడటం వల్ల ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారనీ, తీవ్రంగా గాయపడిన 8ఏళ్ల బాలుడితో పాటు మరొకరిని రక్షించి ఆసుపత్రికి తరలించడం జరిగిందని థానె జిల్లా కలెక్టర్ కేవి మురళీధరన్ తెలిపారు. కాగా పోలీసులు ప్రమాదానికి గురైన వ్యాన్ ను క్రేన్ సహాయంతో బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.