ఎనిమిదో శ్వేతపత్రం విడుదల

అమరావతి, డిసెంబర్ 30 : గత నాలుగున్నర ఏళ్ల ప్రభుత్వ పాలనపై శాఖల వారీగా వరసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం గ్రామీణ, పట్టణ మౌలిక వసతులపై  ఎనిమిదో శ్వేతపత్రం విడుదల చేశారు. గ్రామాల్లో 55వేల కోట్ల రూపాయలు, పట్టణాల్లో  77 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పంచాయతీల్లో 35 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 26వేల కోట్ల రూపాయల నరేగా నిధులను వినియోగించామన్నారు. 5,694 కోట్లతో 23,553 కిలోమీటర్ల  సీసీ రోడ్ల నిర్మించామన్నారు. సీసీ రోడ్లకు ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధుల వినియోగించామని చంద్రబాబు తెలిపారు. ఎనిమిది వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. రెండేళ్లలో గ్రామాల్లోని అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తామని తెలిపారు.