భారత దేశం అభివృద్ధి పథంవైపు అడుగులు వేస్తోంది. దేశంలోనే మొట్ట మొదటి ఎలక్ట్రిక్ హైవేను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది భారత ప్రభుత్వం. ఢిల్లీలో నిర్వహంచిన హైడ్రాలిక్ ట్రైలర్ ఓనర్స్ అసోసియేషన్ కార్యక్రమం వేదికగా తొలి ఎలక్ట్రిక్ హైవే వివరాలను బహిర్గతం చేశారు గడ్కరీ. తొలి రహదారిని దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలమధ్య నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ రహదారిపై ట్రాలీ బస్సుల మాదిరిగానే ట్రాలీ ట్రక్కులను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దాని ద్వారా కాలుష్యం తగ్గటంతో పాటు సామర్థ్యం పెరుగుతుందని అన్నారు.
మొదటగా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు?
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘ఢిల్లీ నుంచి ముంబై వరకు ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలని ప్రణాళిక చేస్తున్నాం. ట్రాలీబస్సుల మాదిరిగానే మీరు ట్రాలీట్రక్కులను ఈ దారిలో తీసుకొస్తాం.’ అని తెలిపారు. అయితే.. ఈ రహదారి గురించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఎలక్ట్రిక్ హైవే అనగానే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. వాహనాలకు ఈ రహదారులపై వెళ్తున్న క్రమంలో ఓవర్హెడ్ విద్యుత్తు లైన్ల ద్వారా పవర్ సరఫరా చేస్తారు. రైల్వే ట్రాక్ల మాదిరిగానే ఉంటాయి. హైవే పొడవున ఓవర్హెడ్ విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేస్తారు.
అన్ని జిల్లాలలో 4 లైన్ల రహదారులు?
మరోవైపు.. పెట్రోల్, డీజిల్ల ద్వారా కాలుష్యం పెరిగిపోతున్న క్రమంలో, భారీ వాహనాల ఓనర్లు ఇథనాల్, మెథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయాలవైపు వెళ్లాలని కోరారు నితిన్ గడ్కరీ. అలాగే.. అన్ని జిల్లా కేంద్రాలను 4 లైన్ల రహదారులతో అనుసంధానిస్తామన్నారు. ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోతుందని, RTOల ద్వారా అందే సేవలను డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.