(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
అందరూ ముద్దుగా పిలుచుకునే ఎస్ పి బాల సుబ్రమణ్యం (బాలు) కు చిన్న తనం నుండి ఇంజనీర్ కావాలనే ఆశ ఉండేదట. బాలు తండ్రి సాంబమూర్తి కూడా తన కుమారుడు ఇంజనీరింగ్ అవ్వాలని ఆకాంక్షించారు. తండ్రి కోరిక, తన ఆశయం రెండు నెరవేర్చుకునేందుకు మద్రాస్ లో అడుగు పెట్టిన బాలు ఏఎంఐఇ (ఇంజనీరింగ్) కోర్టులో చేరారు. కానీ ఇంజనీరింగ్ వృత్తి చేపట్టలేదు.
ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే సినిమాలో పాటలు పాడేందుకు అవకాశం లభించడంతో సినీ రంగంలోనే తన ప్రయాణం కొనసాగించారు. వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. సినీ రంగంలో ప్రస్థానాన్ని కొనసాగించిన బాలు తన గాన మాధుర్యంతో కోట్లాది మంది ప్రజల హృదయాలలో నిలిచిపోయారు.
సినీ గాయకుడిగా, నటుడుగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బహుముఖ ప్రజ్ఞాపాటవాలతో గాన గంధర్వుడుగా ప్రసిద్ధికెక్కారు. నాలుగు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో 40వేలకు పైగా పాటలు పడారు. సోదరి ఎస్ పి శైలజ కూడా నేపథ్య గాయని. బాలుతో కలిసి శైలజ పలు చిత్రాల్లో పాటలు పాడారు. ఎస్ పి శైలజ నటుడు సుభలేఖ సుధాకర్ ను వివాహం చేసుకున్నారు.