మనం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ చిన్న ఆరోగ్య సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. అలాగని ప్రతీ సమస్యకు ఆస్పత్రికి వెళ్లడం కూడా మంచిది కాదు. అందుకే ఇంట్లో కొన్ని గ్యాడ్జెట్స్ ఉంటే ఇంటిల్లి పాది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతగానో ఉపయోగపడ్తాయి. మరి మనం ఎలాంటి మెడికల్ గ్యాడ్జెట్స్ ఇంట్లోఉంచుకోవాలో తెలుసుకుందాం.
కరోనా వైరస్ సంక్షోభంతో ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి? ఏం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అసలే ఇప్పుడు కరోనా వైరస్ కాలంకావడం వలన జ్వరం తీవ్రత ఎంతఉందొ తెలుసుకోవడానికి థర్మామీటర్ బాగా సహాయపడుతుంది. శరీరం వేడిగా అనిపించినప్పుడు,టెంపరేచర్ చెక్ చేసుకుంటే మంచిది. ఆన్లైన్లో కానీ ఆఫ్‌లైన్‌లో డిజిటల్ థర్మామీటర్లు కొనుక్కోవచ్చు. వాటి ధర ఇంచుమించు రూ.100 నుంచి రూ.300 వరకు ఉంటుంది. కాంటాక్ట్‌లెస్ థర్మామీటర్ అయితే రూ.2,000 నుంచి రూ.5,000 మధ్య లభిస్తుంది.
మీరు బరువు పెరుగుతున్నారా? తగ్గుతున్నారా? ఒక్కో సారి హఠాత్తుగా బరువు పెరిగినట్టో,తగ్గినట్టో అనిపిస్తుంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఇలా జరగొచ్చు. అందుకే తరచూ బరువు చూసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా వ్యాయామం చేస్తున్నట్టైతే అప్పుడప్పుడూ బరువు చూసుకుంటూ ఉంటే తేడా తెలుస్తుంటుంది. అందుకే ఇంట్లో వెయింగ్ మెషీన్ ఉంచుకోవడం మంచిది.ఇది రూ.500 నుంచి రూ.5,000 వరకు ధర ఉంటుంది.
ఈ రోజుల్లో అందరికి షుగరు మామూలైపోయింది. అందుకే బ్లడ్ షుగర్ చెక్ చేయడానికి గ్లూకోమీటర్ ఉండటం ఎంతయినా అవసరం. తినడానికి ముందు తిన్న తర్వాత కూడా బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీని ధర రూ.500 నుంచి రూ.2,000 మధ్య ఉంటుంది.
కోవిడ్ 19 కారణంగా పల్స్ ఆక్సిమీటర్లకు డిమాండ్ బాగా పెరిగింది.పల్స్ రేట్ చెక్ చేయడానికి పల్స్ ఆక్సిమీటర్ కావాల్సిఉంటుంది. పల్స్ ఆక్సిమీటర్ రేటు రూ.2,000 నుంచి రూ.5,000 మధ్య ఉంటుంది.
ఇంట్లో పిల్లలు ఉన్నా, ఆస్తమా పేషెంట్లు ఉన్నా, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల తో బాధపడుతున్నవారు ఉన్నా కూడా నెబ్యులైజర్ ఉండటం అనేది చాల అవసరం. ఇది ఇంటిలో ఉండడం వలన ప్రతీ సారి క్లినిక్‌కు వెళ్లాల్సిన అసరంఉండదు.
నెబ్యులైజర్ వెల రూ.1,500 నుంచి రూ.3,000 మధ్య ఉంటుంది. హైపర్ టెన్షన్ లాంటి సమస్యలతో ఇంట్లో ఎవరైనా ఉంటే బ్లడ్ ప్రెషర్ మానిటర్ తప్పకుండా ఉండాలి. చెక్ చేసుకొని నోట్ చేసుకుని ఫ్యామిలీ డాక్టర్‌కు తెలియచేయవచ్చు. అప్పుడే సరైన మెడిసిన్ వాడే అవకాశం ఉంటుంది. దీని ధర రూ.500 నుంచి రూ.3,000 మధ్య లభిస్తాయి.