బీజేపీ కీలక నేత, మాజీ కేంద్ర మంత్రి జస్వంత్ సింగ్ ఇకలేరు

 

(న్యూఢిల్లీ నుండి ‘న్యూస్ ఆర్బిట్’ ప్రతినిధి)

బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జస్వంత్ సింగ్ (82) నేడు కన్నుమూశారు. 2014లో ఇంట్లో కాలుజారి కింద పడటం వల్ల ఆయన మెదడుకు గాయమైంది. నాటి నుండి ఆయన కోమాలోనే ఉన్నారు. ఈ ఏడాది జూన్ నెలలో జస్వంత్ కు తీవ్ర అనారోగ్య సమస్యలు రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని సైనిక్ ఆస్పత్రి లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసారు.

రాజస్థాన్ కు చెందిన జస్వంత్ సింగ్ రాజకీయాల్లోకి రాక ముందు సైనిక అధికారిగా పనిచేశారు. రాజకీయాల పట్ల ఆసక్తితో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి జన సంఘ్ నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. బిజెపి వ్యవస్థాపక నేతల్లో ఒకరైనా జస్వంత్ సింగ్ నాలుగు సార్లు రాజ్య సభ సభ్యుడిగా మరో నాలుగు సార్లు లోక్ సభ సభ్యుడిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. జస్వంత్ సింగ్ వాజపేయి మంత్రివర్గంలో ఆర్థిక, విదేశాంగ, రక్షణ వంటి కీలక శాఖలు నిర్వహించారు. 1980 నుండి 2014 వరకు పార్లమెంట్ సభ్యుడు బాధ్యతలు నిర్వహించిన జస్వంత్ సింగ్ సుదీర్ఘ కాలం ఎంపీగా వ్యవహరించిన నేతగా గుర్తింపు పొందారు. బీజేపీ కీలక నాయకులు వాజపేయి,  ఎల్ కే అద్వానీ లకు సన్నిహితుడైన జస్వంత్ సింగ్ రెండు పర్యాయాలు పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. జస్వంత్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోడీ తో సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు.