రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇక్కడ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు! ఎవరు ఎప్పుడైనా ఎవరికైనా వెన్నుపోటు పొడవచ్చు.. ఎవరు ఎప్పుడైనా ఏ పార్టీకి కావాలంటే ఆ పార్టీకి జంప్ అయిపోవచ్చు.. కాకపోతే అది అధికారంలో ఉన్న పార్టీ అయ్యి ఉండాలి! దానికి వారు చెప్పే కారణం… నియోజకవర్గ అభివృద్ధి కోసం అని.. కాగా అంతర్లీణంగా ధ్వనించే మాట వ్యాపారాల అభివృద్ధి కోసం అని! తాజాగా చంద్రబాబు అనుంగ అనుచరుడుగా పేరున్న నారాయణ కూడా పసుపుజెండా పక్కనపెట్టి ఫ్యాన్ కిందకు చేరాలనుకుంటున్నారట.
అవును… టీడీపీ నేతలకు ఇది భారీ షాకింగ్ విషయం అయినా కూడా.. ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. తన ప్రధాన బిజినెస్ అయిన విద్యావ్యాపారాన్ని కాపాడుకోవడానికి నారాయణ కూడా వైసీపీ బాట పట్టేందుకు రెడీ అవుతున్నాడట. ఏపీలో జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి సర్కార్ విద్యను పటిష్టం చేస్తూ ప్రైవేటు విద్యను అణగదొక్కేస్తున్న క్రమంలో… కోట్లలో వ్యాపారం చేసే నారాయణ వంటి కార్పొరేట్ సంస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయనే చెప్పాలి. ఇదే విషయాన్ని కాస్త అటు ఇటుగా జగన్ అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పారు!
ఈ క్రమంలో జగన్ పార్టీలోకి చేరితే ఈ బాధలు తప్పుతాయని నారాయణ కూడా భావించి రెడీ అయిపోతున్నారని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే తన నియోజకవర్గంలోని తన ప్రధాన అనుచరులను వైసీపీలో చేరాలని నారాయణ ఒత్తిడి చేస్తున్నారట. ఈ విషయంలో నారాయణ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారని, వెనక్కి తగ్గే ఆలోచనలు దాదాపు చేయకపోవచ్చని.. బాబు రాయబారాలు పనిచేయకపోవచ్చని అంటున్నారు!