సైకిల్ ఎక్కిన కిషోర్ చంద్రదేవ్

అమరావతి, ఫిబ్రవరి 24: మాజీ కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆదివారం ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన మద్దతుదారులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వనించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ…కిశోర్ చంద్రదేవ్ లాంటి నేతలు టిడిపిలోకి రావడం చాలా సంతోషదాయకమన్నారు.

ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనుల సంపదను విదేశాలకు దోచిపెట్టేందుకు వైఎస్ఆర్ యత్నించారని చంద్రబాబు విమర్శించారు.

వైఎస్ హయాంలో బాక్సైట్‌ను ప్రైవేటు పరం చేస్తే. వైఎస్ చర్యలను ఆనాడు కిషోర్ చంద్రదేవ్ వ్యతిరేకించారని చంద్రబాబు అన్నారు. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి లైసెన్సులను నేను రద్దు చేశానని చంద్రబాబు స్పష్టం చేశారు.

బాక్సైట్ తవ్వకాలు ఆపిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని చంద్రబాబు అన్నారు.

టిడిపి అధికారంలోకి వచ్చాక గిరిజనులకు ప్రయోజనాలు కల్పించామన్నారు.

అరకు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి కశ్చితంగా గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

పార్టీలో చేరిన  నాయకులకు చంద్రబాబు అభినందనలు తెలియజేశారు.

 

కిషోర్ చంద్రదేవ్ ఐదు సార్లు లోక్‌సభకు, ఒక సారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుండి ఎంపిగా పోటీ చేసి గెలిచారు.

2011 జూలై నుండి 2014 మే వరకు మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో గిరిజన వ్యవహారాలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పని చేశారు.