మాజీ ఎంఎల్ఏ పున్నయ్య కన్నుమూత

శ్రీకాకుళం: మాజీ న్యాయమూర్తి, మాజీ ఎమ్మెల్యే జస్టిస్‌ కె.పున్నయ్య(96) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పున్నయ్య విశాఖపట్నంలోని ఓఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. పున్నయ్య స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావాలి గ్రామం. రెండు సార్లు పున్నయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీ మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి పున్నయ్య కుమార్తె.
పున్నయ్య చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆయన కుమార్తె ప్రతిభా భారతికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెకు బైపాస్‌ సర్జరీ చేశారు. అనంతరం ఆమె కోలుకుంది. జస్టిస్‌ పున్నయ్య మృతి పట్ల వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. ఒక న్యాయకోవిదుడిని కోల్పోయామని, జస్టిస్‌ పున్నయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.