ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ తమ ప్లాట్‌ఫాంలపై ప్రచారమయ్యే ఫేక్ న్యూస్‌కు అడ్డుకట్ట వేసేందుకు నడుం బిగించింది. అందులో భాగంగానే ఫేస్బుక్లో వచ్చే వారం నుంచి ప్రత్యేకంగా ఓ సెక్షన్‌ను అందుబాటులోకి తేనున్నారు. అందులో కోవిడ్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. అలాగే కరోనా వైరస్ పట్ల ప్రజల్లో నెలకొన్న సందేహాలకు సమాధానాలు కూడా ఉంటాయి. తప్పుడు వార్తల వివరాలు ఉంటాయి. వీటి వల్ల ప్రజలు కరోనా పట్ల మరింత అవగాహన పెంచుకోవడమే కాదు.. తప్పుడు వార్తలు ఏవో, అపోహలు ఏవో సులభంగా తెలుసుకుంటారు.
కరోనా నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ఫేక్ న్యూస్ ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆ న్యూస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఫేస్బుక్ వచ్చే వారం కోవిడ్ కోసం ప్రత్యేకంగా ఓ సెక్షన్‌ను ఫేస్బుక్ ప్లాట్‌ఫాంపై ప్రవేశపెట్టనుంది. దాంట్లో కోవిడ్ గురించి అనేక అంశాలపై యూజర్లు అవగాహన కల్పించుకోవచ్చు. అనేక రకాల అపోహలను తొలగించుకోవచ్చు. ఫేస్బుక్ కొత్తగా ప్రవేశపెట్టబోయే ఆ సెక్షన్‌కు ఫ్యాక్ట్స్ ఎబౌట్ కోవిడ్ 19 అని పేరు పెట్టనున్నారు. అందులో కోవిడ్ గురించిన సమస్త సమాచారం ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో.. వారి సూచనలను కూడా ఫేస్బుక్ సదరు సెక్షన్లో ఉంచనుంది. ఇప్పటికే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాంలలో కోవిడ్ సమాచారాన్ని అందిస్తున్నారు. పెద్ద ఎత్తున యూజర్లు ఆ సమాచారాన్ని చదువుతున్నారని, అందుకనే కోవిడ్‌పై వారికి మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా కోవిడ్ సెక్షన్‌ను అందుబాటులోకి తెస్తున్నామని ఫేస్బుక్ వెల్లడించింది.