‘ఫెడరల్ ఫ్రంట్ తప్పదు’

హైదరాబాద్:  ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో బలమైన శక్తిగా ఎదుగుతాయని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ పరిపాలించాలన్న అభిప్రాయం ఆ రెండుపార్టీలకు ఉందనీ, అది సరైనది కాదనీ అన్నారు. ప్రాంతీయ పార్టీలకు ప్రజా బలముందని, ఇటువంటి తరుణంలో  ప్రాంతీయ పార్టీలు కలిసి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు.  జాతీయ పార్టీలు విఫలమవ్వడంతో ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయని ఆయన అన్నారు.  బలమైన కూటమి ఏర్పాటు చేయగలిగిన విధంగా ప్రాంతీయ పార్టీలు ఎదుగుతున్నాయి. దేశంలో ప్రాంతీయ పార్టీల వెంట ప్రజలు ఉన్నారు, ప్రజల వెంట ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీల కూటమి ఆలోచన ఈనాటిది కాదంటూ, 2006లో యుపీఎలో టీఆర్ఎస్ ఒక భాగస్వామ్య పక్షంగా ఉందని ఆయన గుర్తు చేశారు.  ప్రాంతీయ పార్టీలలో ఐక్యత లేకపోవడం వల్లనే నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అలస్యం అయిందన్నారు. రాష్ట్రాలలో కేంద్రంలో బలమైన శక్తులుగా ప్రాంతీయ పార్టీలు ఎదగాలన్నదే సీఎం కేసీఆర్  అభిప్రాయమన్నారు. కాంగ్రెస్,బీజెపీలు రెండు ఎ టీమ్, బి టీమ్‌ అని ఆయన విమర్శించారు. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత ఫెడరల్ ఫ్రంటే ఉంటుందని ఆయన జోస్యం చేప్పారు.